రేషన్‌లో 9 సరుకులు ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్‌

26 Jul, 2021 20:28 IST|Sakshi

ముదిగొండ (మధిర): దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.కార్డులు లేనివారిందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. రేషన్ కార్డులు ఈ దఫాలో రానివారికి కూడా వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

ట్రాక్టర్ ఉందనో, పిల్లలకు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు ఉన్నాయనో, లేకపోతే రాబడి పొలం ఉందనే కారణంతోనే దరఖాస్తులు తిరస్కరించడం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. కూలీకి వెళ్లే కుటుంబం ఫైనాన్స్ నుంచి సెకెండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కుని, బతుకుదెరువు కోసం ప్రయివేట్ కంపెనీలకు ఉద్యోగాలకు పోయిన బిడ్డలున్న కుటుంబాలకు మానవతా హృదయంతో కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధిక నిధులు ఉన్న మన రాష్ట్రంలో గతంలో చేసిన దానికంటే కాస్త ఎక్కువగా ప్రజలకు చేయాలని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతోపాటు 9 రకాల వస్తువులను సంచిలో పెట్టి ‘అమ్మహస్తం’ పేరుతో ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు సరకులు ఎత్తేసి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. బియ్యంతో పాటు గతంలో ఇచ్చిన సరుకులు ఇవ్వాలని కోరారు.  ఈ విషయంపై తాను గతంలో అసెంబ్లీలో మాట్లాడాను.. మళ్లీ మాట్లాడతాను అని స్పష్టం చేశారు. పప్పులు, ఉప్పులు, నూనెలు, చింతపండు కూడా కొనలేని పరిస్థితులు ఉండడంతో పేదలకు రేషన్‌లో ఆ వస్తువులు ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు