పూట గడవడమూ కష్టమే! 

11 Feb, 2024 04:14 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు.. బీఆర్‌ఎస్‌ పాలనపై భట్టి విక్రమార్క ఫైర్‌ 

అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు.. కాళేశ్వరం వంటి నిరర్థక ఆస్తులను సృష్టించారు 

సాక్షి, హైదరాబాద్‌: స్వేచ్ఛా తెలంగాణలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోవడం సంతోషకరమని.. కానీ గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రానికి కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించి, పూటగడవడం కూడా కష్టమనే స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని మండిపడ్డారు.

ప్రణాళిక, హేతుబద్ధత లేకుండా చేసిన అప్పులు సవాల్‌గా మారాయన్నారు. అయితే రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంతోషాలే తమ ముఖ్యమని, మెరుగైన సంక్షేమ పాలన అందించడం తమ లక్ష్యమని.. ఇప్పటికే దుబారా ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టామని వివరించారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా.. బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
‘‘గత ప్రభుత్వ ప్రతి బడ్జెట్‌ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. రాష్ట్ర రాబడిని పెంచి చూపి.. ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనే భ్రమ కల్పించారు. దళితబంధు పథకానికి గత బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తే.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. కాగ్‌ లెక్కల ప్రకారం.. 2021–22 బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చితే ఎస్సీల అభివృద్ధికి రూ.4,874 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.2,918 కోట్లు, బీసీల అభివృద్ధికి రూ.1,437 కోట్లను ఖర్చు చేయలేదు.

2014–15 నుంచి 2023–24 వరకు వడ్డీలేని రుణాల కోసమని.. రైతులకు రూ.1,067 కోట్లు కేటాయించి, రూ.297 కోట్లే ఖర్చు చేశారు. మహిళలకు రూ.7,848 కోట్లు కేటాయించి, రూ.2,685 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి.. దానికి అనుగుణంగా పథకాలకు కేటాయింపులు చేసింది. 

100 శాతం ఇళ్లకు నీళ్లు అబద్ధం 
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రక్షిత తాగునీరు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం రూ.35,752 కోట్ల ఖర్చుతో మిషన్‌ భగీరథ పూర్తి చేశామని గొప్పలు చెప్పింది. కానీ రాష్ట్రంలో రక్షిత మంచినీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. తప్పుడు నివేదికలతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు రాలేదు. 

రైతుబంధుతో అనర్హులకే ఎక్కువ లాభం 
రూ.2 లక్షల రుణమాఫీకి త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. రైతుల ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రైతులకు పెట్టుబడి సాయం పేరిట గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. కానీ దీనిద్వారా అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారు. సాగులో లేని, సాగు యోగ్యంకాని కొండలు, గుట్టలు, రోడ్లు ఉన్న భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు.

పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు రైతుబంధు సొమ్ము అందింది. ఇది అక్రమం. దీనిని పునఃసమీక్షించి అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. ఫసల్‌ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం. 

కొందరికి ఆభరణంగా.. అందరికీ భారంగా.. 
ధరణి కొందరికి భరణంగా, మరికొందరికి ఆభ రణంగా, చాలా మందికి భారంగా మారింది. గత ప్ర భుత్వ తప్పులతో చాలా మంది సొంత భూమిని అ మ్ముకోలేకపోయారు. ధరణి సమస్యల పరిష్కారా నికి ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించాం. 

కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు.. 
గత ప్రభుత్వం నిపుణులు, మేధావుల సూచనలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో.. సాగునీటి, ఆర్థిక రంగాలను అతలాకుతలం చేసింది. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. రూ.లక్షల కోట్ల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అవినీతి, అనాలోచిత విధానాలు, అవకతవకతలపై విచారణ జరిపిస్తాం. 

ఓటాన్‌ అకౌంట్‌ ఎందుకంటే.. 
కేంద్రం ఈ నెల 1న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో కూడా ఓటాన్‌ అకౌంట్‌ పెట్టాల్సి వచ్చింది. కేంద్రం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక.. రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్‌ పెట్టాలని నిర్ణయించాం..’’ అని భట్టి తెలిపారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega