అసెంబ్లీ ఆరు నిమిషాలా?.. ప్రభుత్వ తీరుపై భట్టి విక్రమార్క మండిపాటు

7 Sep, 2022 11:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొదటిరోజు అసెంబ్లీ సమా వేశాలను ఆరు నిమిషాల్లో వాయిదా వేయడాన్ని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని విమ ర్శించారు. మంగళవారం బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా చర్చించాల్సి ఉందని, కానీ ప్రభు త్వం అలా చర్చించే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. అసెంబ్లీ కనీసం 20 రోజులు జరపాలని తాము కోరితే.. రోజులు పెంచలేం కానీ, సభ జరిగే (రెండురోజులు) రోజుల్లో పని గంటలు మాత్రం పెంచుతామని చెప్పడం సరికాదన్నారు. విభజన హామీలను సాధించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని చెప్పారు. 
చదవండి: స్పీకర్‌పై

కాళేశ్వరంపై నిలదీస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనివ్వకుండా ప్రభు త్వం తమపై ఎందుకు ఆంక్షలు విధిస్తోందో అసెంబ్లీలో నిలదీస్తామని భట్టి చెప్పారు. ప్రభుత్వ కార్యక్ర మాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్టుగా చేస్తూ.. వారు కార్యక్రమాలకు రాకుండా అరెస్టులు చేస్తూ ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కడంపై బీఏసీలో నిలదీశామని తెలిపారు. ఆర్థికాంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని, వాస్తవాలు తెలియాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

సంజయ్‌ అజ్ఞానానికి నిదర్శనం
కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. నాలుగు పార్టీల సిద్ధాంతాలే వేరయినప్పుడు ఎలా ఒకటవుతాయని ప్రశ్నించారు’ అని ధ్వజమెత్తారు. మునుగోడులో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని, బీజేపీ కేవలం కార్పొరేట్‌ల దగ్గరే ఉందని, ప్రజల్లో లేదని అన్నారు.  

8 అంశాలపై చర్చ జరపండి
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలు–వ్యవసాయరంగ సమస్యలు, నిత్యావసరాలు– పెట్రోల్‌– గ్యాస్‌ ధరల పెంపు, పోడు భూముల సమస్య, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలు తదితర 8 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరపాలని భట్టి కోరారు. మంగళవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు. కాగా, మంగళవారం కొందరు నిరుద్యోగ కళాకారులు సీఎల్పీ కార్యాలయంలో భట్టిని కలిసి వినతిపత్రం సమర్పించగా, సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. 

భట్టి, రేవంత్‌ భేటీ
సాక్షి, హైదరాబాద్‌: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిలు మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ అయ్యారు. సభ వాయిదా పడిన తర్వాత ఇద్దరూ సమావేశమై ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్షాన అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలోని వీఆర్‌ఏల సమ్మె గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించారు. అనంతరం రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌కు వెళ్లిపోయారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు మాత్రమే హాజరుకాగా, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు గైర్హాజరయ్యారు. సమీప బంధువు చనిపోవడంతో శ్రీధర్‌బాబు, సంగారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమైన సమీక్ష ఉన్న కారణంగా జగ్గారెడ్డి అసెంబ్లీకి రాలేదని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు