కూతురు సమస్యను వెంటనే తీర్చారు.. కానీ

15 Jan, 2021 13:54 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కారుపై భట్టి విక్రమార్క ధ్వజం

సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో  వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలాగైతే విద్యార్థులకు చదువు ఎక్కడ దొరుకుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమస్యల గురించి ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతుల గురిచేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

ఈ సందర్భంగా.. రాష్ట్రంలో అప్రజాస్వమ్య పరిస్థితులు తలెత్తాయన్న ఆయన.. ‘‘ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగాన్ని కోల్పోయిన నీ కూతురు కవిత పరిస్థితిని కొన్ని రోజులు కూడా భరించలేకపోయావు. ఆమెకు నిరుద్యోగ సమస్య ఉందని గుర్తించి వెంటనే ఎమ్మెల్సీ ద్వారా సమస్యను తీర్చావు’’ అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్‌ పాలనా తీరుతో నిరుద్యోగులు, యువత తీవ్ర నిరాశ నిస్సృహల్లో ఉన్నారని వారు గనుక తిరగుబాటు మొదలుపెడితే.. ప్రజాస్వామ్య ఉనికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. (చదవండిఅంత సులభం కాదు.. తొందరపాటు చర్యే! )

అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో పాటు.. ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇంటికో ఉద్యోగం వెంటనే ఇచ్చేలా  నియామకాలు చేపట్టాలని భట్టి డిమాండ్ చేశారు. ‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని ఉద్యోగాల ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ జరిగేంత వరకూ..  దీనిని కూడా మేము నమ్మం. గతంలో 16 వేల కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ తరువాత.. ఇప్పటివరకూ వాళ్లను ట్రైనింగ్‌కు పంపలేదు’’ అని భట్టి విక్రమార్క ప్రభుత్వ తీరును విమర్శించారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు