మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చేస్తోంది: భట్టి విక్రమార్క

19 Jun, 2021 20:27 IST|Sakshi

యువతలో నిరాశ ఉంది

దేశ భవిష్యత్ అంధకారంగా మారుతోంది

విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ

దేశం కోసం ఏఐసీసీ అధ్యక్ష పదవిని స్వీకరించండి 

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చేసే పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

సాక్షి, హైదరాబాద్: ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకోలేక, కొత్త ఉద్యోగాల కల్పన జరగక యువత నిరాశలో కూరుకుపోయిన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూలుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా..  ‘‘కరోనాతో నేడు దేశమంతా అతలాకుతలమై తల్లడిల్లుతోంది. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తూ.. లక్షలాది మరణాలకు కారణమైంది. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సందర్భంలో.. ‘‘దేశానికి ముప్పు దాపురించి ఉంది.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ప్రభుత్వాన్ని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. రాహుల్ గాంధీ విజన్ను, ఆయన మాటలను ప్రధాని మోదీ పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి’’అని భట్టి చెప్పారు. 

అదే విధంగా... ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.  కశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుందని భట్టి అన్నారు. దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు, విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని,  ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించాలని కోరుతూ సీఎల్పీ పక్షాన లేఖ రాస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, కరోనా బాధితులకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిందని చెప్పారు. అదే విధంగా ఎన్.ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాలు ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించందని అన్నారు. 
 
లక్షల మంది చనిపోవడానికి కారణమయ్యారు..
‘‘కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు గత 70 ఏళ్లుగా ఎన్నో రకాల వ్యవస్థలను దేశ ప్రజల కోసం నిర్మాణం చేశాయి. ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు అవసరమైన అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించాయి. అందులో భాగంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వం రంగ సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు.. సహా ఎన్నింటినో నిర్మాణం చేసి జాతికి అంకితం చేసింది. నేడు.. దేశం మీద ఏ మాత్రం అవగాహలేని పాలకులు, కేవలం ప్రచార్భాటం, మాటలతో బతికే ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను కూలుస్తున్నారు. దేశ ప్రజలంతా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకువచ్చారు’’ అని ప్రధాని మోదీని భట్టి విమర్శించారు. 

అదే విధంగా.. ప్రజారోగ్యాన్ని పక్కకు పెట్టి.. కరోనాతో కొన్ని లక్షలమంది చనిపోవడానికి మోదీ కారణమయ్యారని అన్నారు. కరోనా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. లాక్డౌన్ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లక్షలమంది వలస కూలీలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందేనన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కొన్ని నెలలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం దేశ భవిష్యత్తే అంధకారంగా మారుతోందన్నారు. 

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ బాధ్యతలు మళ్లీ స్వీకరించాలని భట్టి కోరారు. రాజీవ్ గాంధీ హయాంలో దేశాన్ని ప్రపంచంలో మూడో శక్తిగా తీర్చిదిద్దారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించారు. అమెరికా, రష్టాలతో సమానంగా దేశాన్ని నడిపించారని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ గా దేశంలో ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలను తీసుకువచ్చాం. ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయిమెంట్, ఆహార భద్రత వంటివి తెచ్చామని చెప్పారు.

చదవండి: Huzurabad: తెరపైకి పురుషోత్తంరెడ్డి పేరు.. ఎవరీయన?!

మరిన్ని వార్తలు