గుర్రపు బండిపై అసెంబ్లీకి..

27 Sep, 2021 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో పెరగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు, నిత్యావసర ధరలపై నిరసన చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితి ఉందని ప్రభుత్వానికి చెప్పడం కోసం అసెంబ్లీ సమావేశాలకు గుర్రపు బండిపై వెళ్లినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీకి ఏ విధంగా వెళ్లాలనేది సభ్యులుగా తమ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అసెంబ్లీకి హాజరు కాకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ప్రజలపై భారం పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మండిపడ్డారు.


చదవండి: మండలిలో ఎమ్మెల్సీ కవిత తొలి ప్రసంగం

కాగా భారత్‌ బంద్‌లో భాగంగా కాంగ్రెస్‌ నేతలు వినూత్న శైలిలో నిరసన తెలిపారు. గాంధీ భవన్‌ పనుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబులు గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వచ్చారు. అయితే వారిని పోలీసులు రోడ్డు మీదే అడ్డుకున్నారు. గుర్రపు బండ్లను లోలపికి అనుమతించమని చెప్పారు. దీంతో అసెంబ్లీ గేటు ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని భట్టి అన్నారు.


కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్‌ కిషోర్‌.. పక్కా ప్లాన్‌తోనేనా?!

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అసెంబ్లీకి వెళ్లామని పేర్కొన్నారు. వాహనాలు తాము కూడా వాడలేని పరిస్థితిలో ఉన్నామని, దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టేశాయని విమర్శించారు. సభ్యులుగా తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్, చైర్మన్‌కు ఉందని గుర్తు చేశారు. సభ్యుల హక్కులను కాలరాయడంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు సమాధానం చెప్పాలని కోరారు. అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదేనా కోరి తెచ్చుకున్న తెలంగాణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్, స్పీకర్ నుంచి స్పష్టమైన సమాధానం కోరుతున్నామన్నారు. ప్రభుత్వ ఆగడాలు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు