భట్టి పాదయాత్ర @ 1,365 కిలోమీటర్లు.. 

12 Mar, 2023 02:05 IST|Sakshi

బోథ్‌ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుంచి ఈ నెల 16న ప్రారంభం 

91 రోజులు, 39 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏడు ఉమ్మడి జిల్లాల మీదుగా.. 

ఖమ్మం నియోజకవర్గంలో జూన్‌ 15న భారీసభతో ముగింపు 

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల షెడ్యూల్‌ ప్రకటించిన కాంగ్రెస్‌  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క భారీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా రాష్ట్రంలోని 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు 91 రోజులపాటు జరగనున్న ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రారంభమై ఖమ్మం నగరంలో నిర్వహించే భారీ బహిరంగసభతో ముగియనుంది.

ఇందుకు సంబంధించి రూట్‌మ్యాప్‌ కూడా ఖరారయింది. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న యాత్రకు తోడుగా భట్టి మరోవైపు నుంచి యాత్రకు ఉపక్రమించడం గమనార్హం. భట్టి యాత్రకు సంబంధించి గాందీభవన్‌ వర్గాలు శనివారం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 16న సాయంత్రం నాలుగు గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బజార్‌ హత్నూర మండలం పిప్రి గ్రామంలో యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి , చెన్నూరు, మంచిర్యాల వరకు జరుగుతుంది.

మంచిర్యాల నియోజకవర్గంలో యాత్ర ముగింపు సందర్భంగా లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ హాజరవుతారని సమాచారం. ఈ సభ తర్వాత ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్‌ (వెస్ట్‌), స్టేషన్‌ ఘన్‌పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌ల వరకు యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు.

షాద్‌నగర్‌ వెళ్లే లోపు హైదరాబాద్‌ పరిసరాల్లో మరో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందుల మీదుగా ఖమ్మం వరకు యాత్ర సాగనుంది. ఈ క్రమంలో యాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. యాత్రల్లో భాగంగా నిర్వహించనున్న మూడు బహిరంగ సభలకు ఏఐసీసీ నాయకత్వం హాజరయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.  

ప్రజల ఆశలు, అవసరాలే నా యాత్ర ఎజెండా
యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం శనివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ నేతలు ఆమేర్‌ జావెద్, భరత్‌తో కలిసి భట్టి మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు లక్ష్యాలు నెరవేరక ప్రజ లు నిరాశా నిస్పృహల్లో ఉ న్నారని, వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడేందుకు యాత్ర చేపట్టామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వా త రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడంతోపాటు ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా నిలబెడతామని చెప్పారు.

‘మీలో ఒకడిగా మీ మధ్య పాదయాత్ర చేసేందుకు వస్తున్నా. నాతో పాటు నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు ఇవ్వాలని కోరుతున్నా’అని భట్టి అన్నారు. కాగా, తెలంగాణ పోరు యా త్ర పేరుతో తాను బాస ర నుంచి నిర్వహిస్తు న్న పాదయాత్రను కూడా భట్టి యాత్రలో విలీనం చేస్తున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. తనతోపాటు ఉత్తమ్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ భట్టి యాత్రలో భాగస్వాములం అవుతామని చెప్పారు.

మరిన్ని వార్తలు