నకిలీ విత్తనాలకు అడ్డుకట్టేది?

1 Mar, 2022 04:44 IST|Sakshi
పొద్దుతిరుగుడు పంటను పరిశీలిస్తున్న భట్టి

వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి

సాక్షి ప్రతినిది, ఖమ్మం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన సలహా మేరకు రైతులు వరికి బదులు మిర్చి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేశారు. కానీ నకిలీ విత్తనాలతో ఆయా పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలి’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో భట్టి చేపట్టిన పాదయాత్ర రెండోరోజు సోమవారం ముదిగొండ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా గోకినేపల్లి సమీపాన ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభు త్వం వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

గతంలో పంటలు సాగు చేసే రైతులకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేశారని, ఈ విషయంలో ప్రభుత్వ పాలసీ దుర్మార్గంగా ఉం దని దుయ్యబట్టారు.  కేసీఆర్‌ పాలన గాడి తప్పిందని విమర్శించారు. రూ. 1,500 కోట్లతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే ఇందిరాసాగర్‌ పనులను  కేసీఆర్‌ నిలిపివేయించి ప్రా జెక్టు రీడిజైన్‌ పేరిట నిర్మాణ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 25 వేల కోట్లకు పెంచారని భట్టి మండిపడ్డారు. సీఎల్పీ నేతగా రాష్ట్రం లోని అన్ని మండలాలకు వెళ్తానని, శాసనసభ్యుడిగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యలో ఉన్నానని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు  దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 

సీఎం నియోజకవర్గంలో కొనుగోలు చేశాం.. 
భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా ముదిగొండ మండలంలోని గోకినేపల్లిలో రైతులు ఆయన్ను కలిశారు. కేసీఆర్‌ చెప్పినట్లు వరికి బదులు ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు వేస్తే.. నకిలీ విత్తనాలతో మునిగామని గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే ఈ విత్తనాలు కొన్నట్లు రైతులు వివరించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని భట్టి రైతులకు భరోసా ఇచ్చారు.   

మరిన్ని వార్తలు