కవితకు నోటీసులు.. భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా?: భట్టి ఫైర్‌

9 Mar, 2023 13:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువురిని అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఈ కేసులో కవితకు నోటీసులు అందడంతో ప్రతిపక్ష నేతలు బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్‌ స్కామ్‌ ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది. తాను గాంధేయవాదినంటూ కేజ్రీవాల్‌ గొప్పలు చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌పై కేజ్రీవాల్‌ సమాధానం చెప్పాలి. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొ​ంటున్న మంత్రులు రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌ కూడా రాజీనామా చేయాలి. దీనిపై అన్నా హజరే బయటకు వచ్చి మాట్లాడాలి. 

మీకు అవమానం జరిగితే తెలంగాణకు జరిగినట్టా..?. లిక్కర్‌ స్కామ్‌లో ఎంత పెద్దవాళ్లు ఉ‍న్నా తప్పించుకోలేరు. దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేయాలి. కవితకు నోటీసులు వస్తే తెలంగాణకు అవమానం జరిగినట్లా..?. కవితకు అవమానం.. తెలంగాణకు కాదు. భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా?. దీనిపై సమాజం ప్రశ్నించాలి. ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తోంది అనేది వేరే చర్చ. కానీ.. లిక్కర్‌ స్కామ్‌కి, వేధించడానికి సంబంధం లేదు. లేని విషయాల్లో వెంటాడితే ఖండించాలి. అంతుకు ముందు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి కూడా నోటీసులిచ్చారు. వాళ్లది లిక్కర్‌ స్కామ్‌ కాదు. వ్యక్తిగత దోపిడీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొలేదు. వారికి సీబీఐ, ఈడీ క్లీన్‌చీట్‌ ఇచ్చిందన్నారు. 
 

మరిన్ని వార్తలు