ఇళ్లు అవే.. ఎన్నికలే వేరు

20 Sep, 2020 03:30 IST|Sakshi
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న భట్టి. చిత్రంలో వీహెచ్‌

మున్సిపల్‌ ఎన్నికలప్పుడు చూపెట్టిన ఇండ్లనే ఇప్పుడూ చూపెడుతున్నారు

గ్రేటర్‌లో కట్టింది 3,428 ఇండ్లు మాత్రమే... ప్రతి డివిజన్‌లో ఇదే చెప్తాం: సీఎల్పీ నేత భట్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇండ్లు అవే, కాకపోతే ఎన్నికలే మారిపోతున్నాయని కాం గ్రెస్‌ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఈ ఇండ్లను చూపెట్టి ఓట్లు దండుకున్నారని, ఇప్పుడు మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలవేళా వాటినే చూపెట్టి ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. రెండ్రోజులపాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి నగరంలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన భట్టి శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కట్టామని, వాటిని చూపెడతామని అసెంబ్లీలో మంత్రి ప్రగల్భాలు పలికారని, కానీ కట్టింది మాత్రం 3,428 ఇండ్లేనని, వాటిని మాత్రమే గ్రేటర్‌  హైదరాబాద్‌ పరిధిలో తాను చూశానని చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఓపె నింగ్‌కు వస్తా.. కోడికూర, కల్లు తెచ్చిపెట్టండి, దావత్‌ చేసుకుందామని గతంలో కేసీఆర్‌ చెప్పారని, కానీ కల్లు పులిసిపోతోంది.. కోడికూర కుళ్లిపోతోంది.. కానీ ఇండ్లు మాత్రం రెడీ కాలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లక్ష ఇండ్లు చూపిస్తామన్న ప్రభుత్వం వాటిని చూపించలేక పారిపోయిందని అన్నారు. 

ఇంకెంతకాలం మోసం చేస్తారు
‘మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్లు చూపెట్టి ఇవే గ్రేటర్‌ ప్రజలకు అంటున్నారు.. మరి స్థానికులకు ఎక్కడ ఇస్తారు? తుక్కుగూడ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇవే ఇండ్లు చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడు ఇవే గ్రేటర్‌ ప్రజలకు అంటున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో చూపించి అవి జీహెచ్‌ఎంసీ ఇండ్లు అంటున్నారు’అని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. లక్ష ఇండ్ల పేరుతో ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రతినిధులతో ఇండ్ల పరిశీలనకు వెళ్లడంతో ఇప్పుడు తన ద్వారా గ్రేటర్‌ ప్రజలకు వాస్తవాలు తెలిశా యని అన్నారు. గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టలేదన్న విషయాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో ప్రచారం చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, నాయకులు దాసోజు శ్రావణ్, ఫిరోజ్‌ఖాన్, మూల విక్రమ్‌గౌడ్, బల్మూరి వెంకట్రావు, అనిల్‌కుమార్‌ యాదవ్, నాగరిగారి ప్రీతం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు