గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌: ఆయనే ఎందుకు

13 Sep, 2021 05:10 IST|Sakshi

అనూహ్యంగా అందలం

బలమైన పాటిదార్‌ సామాజికవర్గం వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు ఉన్నత పదవి

ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ శాసనసభా పక్షం

నేడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం

గాంధీనగర్‌:  గుజరాత్‌లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌(59)ను అదృష్టం వరించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్‌ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ జోషీ, సీనియర్‌ నేత తరుణ్‌ చుగ్‌ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు తెరపడింది. భూపేంద్ర పటేల్‌ ఆదివారం సాయంత్రం గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర వెంట నరేంద్రసింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ జోషీ, విజయ్‌ రూపానీ, సి.ఆర్‌.పాటిల్‌ తదితరులు ఉన్నారు.

నేడు భూపేంద్ర ఒక్కరే ప్రమాణం
భూపేంద్ర పటేల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాణ స్వీకా రం చేస్తారని గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరిపి, 2, 3 రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ శాసనసభా పక్ష భేటీలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు.

మోదీ, షా, నడ్డాలకు కృతజ్ఞతలు
తనపై నమ్మకం ఉంచి, ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ,  హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్‌ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు.   భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

మళ్లీ అధికారం దక్కించుకోవాలనే..
గుజరాత్‌ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది. నిజానికి తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా నగర్‌ హవేలి, డయ్యూ, డామన్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా పేర్లు వినిపించాయి. కొత్త ముఖ్యమంత్రిగా వారిద్దలో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగింది. ఆశావహుల జాబితాలో భూపేంద్ర పటేల్‌ పేరు లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం.

భూపేంద్ర పటేల్‌ గుజరాత్‌లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్‌ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్‌ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్‌ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు.

వార్డు కౌన్సిలర్‌ నుంచి సీఎం దాకా..
అహ్మదాబాద్‌:  గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్‌ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శశికాంత్‌ పటేల్‌ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. గుజరాత్‌ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్‌ పటేల్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్‌ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్‌ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.

అహ్మద్‌బాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. అహ్మదాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిపొ్లమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్‌ పాటిదార్‌ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్‌ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్‌ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అవుతుండడం విశేషం.

ఆయనే ఎందుకు?
వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను అధిష్టానం భూపేంద్ర పటేల్‌పై మోపింది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. బలమైన పాటిదార్‌(పటేల్‌) సామాజికవర్గంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు చూరగొన్న వ్యక్తి కావడమే ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.

నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. అప్పుడే మోదీ దృష్టిలో సమర్థవంతుడైన నాయకుడిగా ముద్రపడ్డారు. ఇటీవల కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్‌ సిలిండర్లు విరివిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించారు. పదవిలో ఉన్నప్పటికీ ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం భూపేంద్ర ప్రత్యేకత. ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆనందిబెన్‌ పటేల్‌ సిఫారసు కూడా బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపేలా చేసింది.

కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తమ పార్టీ అధిష్టానం ఆనందిబెన్‌ అభిప్రాయానికి విలువనిచి్చందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. లేకపోతే నితిన్‌ పటేల్‌ గానీ, మరొకరు గానీ ముఖ్యమంత్రి అయ్యేవారని వెల్ల డించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మన్‌సుఖ్‌ మాండవియా(ప్రస్తుతం కేంద్ర మంత్రి) గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పాటిదార్‌ వర్గం కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీల వెనుక చేరకుండా చూడాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని మరో నేత చెప్పాడు. గుజరాత్‌ జనాభాలో పాటిదార్‌ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్‌ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు.  

మరిన్ని వార్తలు