అర్ధరాత్రి హైడ్రామా: పళనికి ఎదురుదెబ్బ.. పన్నీర్‌ సెల్వంకు భారీ ఊరట

23 Jun, 2022 09:47 IST|Sakshi

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్‌ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. దీంతో పన్నీర్‌సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. 

జూన్‌ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్‌ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్‌ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. 

అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్‌ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  

అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్‌ సెల్వం వర్గం. జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్‌ సుందర్‌ మోహన్‌ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్‌ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి.

చదవండి:  ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు

మరిన్ని వార్తలు