Maharashtra Politics: ‘మహా’ ట్విస్ట్‌.. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే!

30 Jun, 2022 17:30 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా  ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు.

వ్యూహం మార్చిన బీజేపీ
గత పది రోజులుగా ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉద్దవ్‌ సర్కార్‌ను కూలదోసామన్న పేరు రాకుండా జాగ్రత్త పడింది. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ను బీజేపీ వెనకుండి నడిపించేందుకు సిద్ధమైంది. ఎవరూ ఊహించని విధంగా ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో మహారాష్ట్ర సర్కార్‌ కొలువుదీరనుంది. 

సీఎం పదవి ఆశించలేదు
ముఖ్యమంత్రి పదివిని ఏనాడు ఆశించలేదని ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. బీజేపీ పెద్ద మనసుతో సీఎం పదవి మాకు ఇచ్చిందని ఆయన అన్నారు. బాల్‌ థాక్రే ఆశయాలను కొనసాగిస్తానని, హిందుత్వ ఎజెండా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ‘ఔరంగాబాద్‌ పేరు మార్చడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలవడానికి ప్రయత్నించా. ఉద్దవ్‌ ఠాక్రే మాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.’ అని ఏక్‌నాథ్‌ షిండే అన్నారు.

అంతకుముందు ఏక్‌నాథ్‌ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్‌నాథ్‌ షిండే తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు.
చదవండి: శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే!

మరిన్ని వార్తలు