బిహార్‌ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!

18 Nov, 2020 19:55 IST|Sakshi

పట్నా: బిహార్‌ అసెంబ్లీ విజేతల సామాజిక నేపథ్యాలను విశ్లేషించగా, గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ధనవంతులు, నేర చరితులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఆర్జేడీ నాయకత్వంలో మహా కూటమితోపాటు ఏఐఎంఐఎం పార్టీలు కలిసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం టిక్కెట్లను క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఇవ్వగా, 58.2 శాతం మంది విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అవే పార్టీలు 61.7 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 66.8 శాతం ఎమ్మెల్యేలు గెలిచారని ‘అసొసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌’ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.

2015 ఎన్నికల్లో 25 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు దాటిన ధనవంతులు కాగా, 2020 ఎన్నికల్లో వారి సంఖ్య 33 శాతానికి చేరుకుంది. వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున 86 శాతం మంది ధనవంతులు పోటీ చేయగా, 78 శాతం మంది విజయం సాధించారు. సీపీఐ నుంచి గెలిచిన రామ్‌ రతన్‌ సింగ్‌ బహుళ కోటీశ్వరుడు. లోక్‌జన శక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రాజ్‌ కుమార్‌ సింగ్‌ 1.9 కోట్ల అధిపతి. ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌ కుమార్‌ సింగ్‌ నగదు ఆస్తులు 51 కోట్లు.

మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనంత్‌ కుమార్‌ సింగ్‌ నగదు ఆస్తులు 51 కోట్లు. ఆయనపై అత్యధికంగా 38 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 11 హత్యాయత్నం కేసులు, నాలుగు కిడ్నాపింగ్‌ కేసులు ఉన్నాయి. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఆస్తిపరులు, నేరస్థులు గణనీయంగా పెరిగారు. (చదవండి: బిహార్‌ ఫలితాలు-ఆసక్తికర అంశాలు)

మరిన్ని వార్తలు