‘తేజస్వీ బర్త్‌డే గిఫ్ట్‌గా సీఎం పీఠం’

10 Nov, 2020 08:31 IST|Sakshi

పట్నా: బిహార్‌ రాజకీయాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మరో సారి నితీష్‌ సర్కార్‌ అని ఎన్‌డీఏ కూటమి భావిస్తుండగా.. మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌కు అధికారం ఖాయమని అంచాన వేస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి పీఠం బర్త్‌డే గిఫ్ట్‌గా దక్కనుంది అని తెలిపారు. నవంబర్‌ 9న తేజస్వీ యాదవ్‌ పుట్టిన రోజు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ ఎంతో ఘనంగా తేజస్వీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో బిహార్‌ ప్రజలు నితీష్‌ కుమార్‌ను తిరస్కరించారు. ఉపాధి కల్పన వంటి అంశాల్లో జేడీయూ ప్రభుత్వం ఘోరంగా పరాజయం అయ్యింది. అంతేకాక నితీష్‌ పాలనలో ఎన్నో స్కాములు జరిగాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఈ సారి మహాఘట్‌ బంధన్‌కు ఓటేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పక్కన పెట్టండి. మాకు బిహారీల పట్ల నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ని మాకు ఇస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. (చదవండి: ఆర్‌జేడీ కూటమికే జై)

కాంగ్రెస్‌ నాయకుడు కృతి జా అజాద్‌ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టిన రోజు కానుకగా ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోబోతున్న తేజస్వీ యాదవ్‌కు అభినందనలు. ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు జా. ఒకవేళ తేజస్వీ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం ఓ రికార్డు సృష్టిస్తుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు సీఎంలు అయ్యారనే ఘనత దక్కుతుంది. తేజస్వీ కుటుంబంలో ఇప్పటికే ఆయన తండ్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌, తల్లీ రబ్రీదేవిలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక మెజారిటీ ఎగ్జిట్‌ పోల్ప్‌ మహాఘట్‌బంధన్‌ భారీ విజయం సాధించబోతుందని అంచాన వేశాయి. ఇక ఇప్పటికే 38 జిల్లాలోని 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మరి కొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్తు ఏంటనే విషయం బయటపడనుంది. 

మరిన్ని వార్తలు