బిహార్‌‌: మంత్రులకు శాఖల కేటాయింపు

17 Nov, 2020 19:47 IST|Sakshi

బిహార్‌లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు

కీలక శాఖలు తన వద్దే పెట్టుకున్న సీఎం

పట్నా : బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతిష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రి మండలిలో బీజేపీకి 7, జేడీయూకి 5 పదవులు దక్కాయి. హెచ్‌ఏఎం, వీఐపీలు కూడా మంత్రిమండలిలో స్థానం సంపాదించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. కీలకమైన హోంశాఖతో పాటు ప్రజా పరిపాలన, విజిలెన్స్‌ వంటి శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి, రేణూ దేవి, తార్‌ కిషోర్‌లను డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. కాగా రేణూ దేవి గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని చేశారు.

ఇక నితీశ్‌ కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం పంచాయతీ రాజ్, సంక్షేమం, పరిశ్రమల శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్నారు. నితీశ్‌ సీఏంగా ఉన్న 15  ఏళ్లలో ఎక్కువ  కాలం  ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన సుశీల్‌ మోదీ స్థానంలో రేణూ దేవి, తార్‌ కిషోర్‌కు ఈసారి అవకాశం కల్పించడం గమనార్హం. తార్‌ కిషోర్‌ ఆర్థిక, వాణిజ్య పన్నులు, పర్యావరణం, అటవీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ , పట్టణాభివృద్ధి శాఖలను పర్యవేక్షించనున్నారు. ఇక మంగళవారం జరిగిన మొదటి కేబినెట్‌ సమావేశంలో నవంబర్ 23 నుండి నవంబర్ 27 వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశానికి నూతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన 17వ అసెంబ్లీ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.(చదవండి: బిహార్‌ ముఖ్యమంత్రిగా ఏడోసారి)

  • మాజీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి (జేడీ-యు)- గ్రామీణ ఇంజనీరింగ్, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, సమాచారం , ప్రజా సంబంధాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
  • బిజేంద్ర ప్రసాద్ యాదవ్(బీజేపీ)-  ఇంధన, నిషేధ, ప్రణాళిక, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు
  • మేవాలాల్‌ చౌదరి (జేడీ-యు)- విద్యా శాఖ
  • షీలా కుమారి(బీజేపీ)- రవాణా  శాఖ
  • మాజీ సీఎం, హెచ్‌ఏఎం అధినేత జితన్ రామ్ మాంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్‌-  చిన్న నీటిపారుదల , ఎస్సీ / ఎస్టీ సంక్షేమ శాఖలు
  • ముఖేష్ సాహ్ని(వికాస్‌ శీల్ ఇన్సాన్ పార్టీ- వీఐపీ)- పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 
  • మంగల్ పాండే (బీజేపీ)-  ఆరోగ్య, రహదారి, కళా సంస్కృతి శాఖ
  • అమ్రేంద్ర ప్రతాప్ సింగ్(బీజేపీ)- వ్యవసాయం, సహకార సంస్థలు
  • రాంప్రీత్ పాశ్వాన్- ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ
  • జీవేశ్‌ మిశ్రా(బీజేపీ)- పర్యాటక, కార్మిక, గనుల శాఖ
  • రామ్ సూరత్ రాయ్- రెవెన్యూ, న్యాయ శాఖ
మరిన్ని వార్తలు