బిహార్‌ రాజకీయాల్లో కీలక పరిణామం! అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ

29 Jun, 2022 17:56 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న తేజస్వీ యాదవ్‌

పట్నా: మహారాష్ట్ర పరిణామాలతో ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాల్లో మరింత వేడి పెంచే సంఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో ఇప్పటివరకు అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) వెనక్కినెట్టింది. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి షాకిస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఈమేరకు జాతీయ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

ఏఐఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ అంజార్‌ నైమీ, ముహమ్మద్‌ ఐజర్‌ అస్ఫీ, సయ్యద్‌ రుక్నూద్దీన్‌, షానవాజ్‌ తమ పార్టీలో చేరినట్టు ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌ బుధవారం ప్రకటించారు. కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం బిహార్‌లో 5 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. 
చదవండి👉🏻ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు?

అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ
తాజా చేరికలతో ఆర్జేడీ మరింత బలం పుంజుకుంది. 79 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో 77 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఉంది. 243 సీట్లున్న బిహార్‌లో జేడీ (యూ), బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జేడీయూ 45 సీట్లు సాధించగా.. బీజేపీ 74 సాధించింది. వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి చెందిన ముగ్గురు కాషాయ పార్టీలో చేరడంతో వారి బలం 77కు పెరిగింది. ఇక కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

90 చోట్ల పోటీ చేస్తే ఫలితాలు శూన్యం!
2020 బిహార్‌ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలుపొంది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఏఐఎంఐఎం పార్టీ... 2021 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. 90 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ భవిష్యత్‌ అయోమయంలో పడుతుందనే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా దాదాపు 20 చోట్ల ఆర్జేడీ విజయావకాశాలను అసదుద్దీన్‌ పార్టీ దెబ్బకొట్టడం గమనార్హం!|
చదవండి👉🏻మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్‌నాథ్‌ షిండే ప్లాన్‌ ఇదే!

మరిన్ని వార్తలు