తాగి చనిపోతే పరిహారం ఇవ్వం.. తేల్చి చెప్పిన సీఎం.. అసెంబ్లీలో రగడ..

16 Dec, 2022 18:54 IST|Sakshi

పాట్నా: బిహార్ సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. ఈ విషయంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. 

కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. అలాంటి వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్యం తాగితే చనిపోతారని, తాగాలని ప్రోత్సాహించే వారు మీకు ఎలాంటి మేలు చేయరని సీఎం సభలో అన్నారు.

అయితే నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బిహార్‌లో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం 2016 నుంచి అమలు అవుతున్నప్పటికీ.. అక్రమంగా కొందరు సారా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగితే చస్తారని సీఎం వ్యాఖ్యానించారు.
చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్‌ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..

మరిన్ని వార్తలు