మంత్రి వ్యాఖ్యలు వైరల్‌.. ‘నేనో దొంగల ముఠా నాయకుడిని, నా దిష్టి బొమ్మలు దహనం చేయండి'

13 Sep, 2022 14:54 IST|Sakshi

పాట్నా: ఆర్‌జేడీ నేత, బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్.. అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాఖలోని అధికారులంతా దొంగలే అన్నారు. వ్యవసాయ శాఖలో ఒక్క విభాగం కూడా అవినీతి రహితంగా లేదని ఆరోపించారు. ఇక ఈ శాఖకు మంత్రి అయినందుకు తాను దొంగల ముఠాకు నాయకుడ్ని అని వాఖ్యానించారు. అంతేకాదు తనపై ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పారు.

సీడ్‌ కార్పొరేషన్‌ అందించే విత్తనాలను ఓ ఒక్క రైతు కూడా ఊపయోగించడం లేదని మంత్రి అన్నారు. అయినా సీడ్ కార్పొరేషన్‌ రూ.150-200 కోట్లను తీసుకుంటోందన్నారు. కైమూర్‌లో సోమవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆయన మాత్రం తన వ్యాఖ్యల్లో ఒక్క పదం కూడా వెనక్కితీసుకోనని స్పష్టం చేశారు. తాను మాట్లాడింది వాస్తవమన్నారు. తనపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని, వాళ్లకోసమే పోరాడుతానని అన్నారు.

అంతేకాదు ప్రజలు తన దిష్టిబొమ్మలను దహనం చేయాలని మంత్రి సూచించారు. అప్పుడే రైతులు తనపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకుంటానని చెప్పారు. లేకపోతే అన్నీ సవ్యంగానే ఉన్నాయని పొరపడే అవకాశముందని పేర్కొన్నారు. బిహార్‌లో కొత్తగా ఎర్పాటైన మహాఘట్‌బంధన్ ప్రభుత్వంపై కూడా సుధాకర్ సింగ్ స్పందించారు. ప్రభుత్వం కొత్తదే, కానీ పనితీరు మాత్రం పాతగానే ఉందని స్పష్టం చేశారు.
చదవండి: కాంగ్రెస్ పని ఖతం.. వాళ్లను సీరియస్‌గా తీసుకోవద్దు..

మరిన్ని వార్తలు