రణరంగంగా బిహార్‌ అసెంబ్లీ.. మగాడివైతే చంపు..

24 Mar, 2021 01:17 IST|Sakshi
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను భద్రతాసిబ్బంది బయటకు లాక్కొస్తున్న దృశ్యం 

స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న విపక్ష సభ్యులు

సభలో గందరగోళం; ఫర్నిచర్‌ ధ్వంసం

ఎమ్మెల్యేలను లాక్కుంటూ బయటకు తెచ్చిన మార్షల్స్, పోలీసులు

పోలీసులకు అదనపు అధికారాలు కల్పించే బిల్లు అంశంలో విధ్వంసం

పట్నా: బిహార్‌ అసెంబ్లీ మంగళవారం రణరంగాన్ని తలపించింది. స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న విపక్ష సభ్యులను నిలువరించే విషయంలో మార్షల్స్‌కు సహకరించేందుకు సభలోకి పోలీసులను పిలవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని సాయుధ పోలీసు బలగాలను మరిన్ని అధికారాలను కల్పించే ‘బిహార్‌ స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బిల్, 2021’ ను అడ్డుకునేందుకు ఐదు పార్టీల విపక్ష కూటమి విఫల యత్నం చేసింది. ఎట్టకేలకు, మంగళవారం సాయంత్రం ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపాక బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  వారెంట్‌ లేకుండా సోదాలు జరిపే, అరెస్ట్‌ చేసే అధికారం స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌లకు కల్పించే ప్రతిపాదనను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సభలోకొచ్చిన స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లనివ్వకుండా, పోడియంను చుట్టుముట్టిన పలువురు ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. మిగతా విపక్ష సభ్యులు వెల్‌లో, సభలో గందరగోళం సృష్టించారు. కుర్చీలను ధ్వంసం చేశారు. విధాన సభ కార్యదర్శి కుర్చీని విసిరివేశారు.

విపక్షసభ్యుల తీరు చూసిన అధికార పక్ష సభ్యుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. విపక్ష సభ్యుల వీరంగంతో షాక్‌కు గురైన స్పీకర్‌ విజయ్‌ సిన్హా చేష్టలుడిగిపోయారు. ఆ సమయంలో, తాత్కాలికంగా స్పీకర్‌ స్థానంలో కూర్చున్న బీజేపీ సభ్యుడు ప్రేమ్‌ కుమార్‌ చేతుల్లో నుంచి కాగితాలను లాక్కుంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యేతో మంత్రి అశోక్‌ చౌధరి బాహాబాహీకి దిగారు. దీంతో స్పీకర్‌ సభను సాయంత్రం 4.30 వరకు వాయిదా వేశారు. ఆ తరువాత స్పీకర్‌ చాంబర్‌ను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు.. ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో, మార్షల్స్‌కు సహకరించేందుకు విధాన సభలోనికి పోలీసులను పిలిపించారు. పోలీసులు, మార్షల్స్‌ కలిసి పలువురు ఆర్జేడీ, సీపీఎం ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు. అక్కడ కొందరు ఎమ్మెల్యేలు సొమ్మసిల్లి పడిపోయారు. తమను పోలీసులు కొట్టారని ఆ తరువాత ఆ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం నితీశ్‌ సమక్షంలోనే అధికార పక్ష సభ్యులు తన చేతిని విరగ్గొట్టారని చేతి కట్టుతో వచ్చిన మరో ఆర్జేడీ ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యేలను జుట్టు పట్టుకుని కొడుతూ బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు, మరో మహిళా ఎమ్మెల్యేను పోలీసులు బయటకు లాక్కుని వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మగాడివైతే చంపు..
బిల్లుకు వ్యతిరేకంగా పట్నాలో మంగళవారం ఉదయం నుంచి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. డార్క్‌ బంగ్లా క్రాసింగ్‌ వద్ద అసెంబ్లీ వైపు వెళ్తున్న వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేశారు. వాటర్‌కెనాన్లు ప్రయోగించారు. పోలీసులపై ఆర్జేడీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కార్యకర్తలు, పోలీసులతో పాటు ఆ ర్యాలీని కవర్‌ చేస్తున్న జర్నలిస్ట్‌లకు కూడా గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై ఆర్జేడీ నేత తేజీస్వీ యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీ బయటకు లాక్కుని వస్తున్న పోలీసులను అడ్డుకుంటూ, అక్కడ ఉన్న అదనపు ఎస్పీతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. సీఎం నితీశ్‌ను ఉద్దేశిస్తూ.. ‘నితీశ్‌ కుమార్‌.. నీవు మగాడివైతే మమ్మల్ని కొట్టించే బదులు కాల్చి చంపు’ అని ఆ తరువాత ఆగ్రహంగా ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు