కార్యకర్తలను హెచ్చరించిన తేజస్వీ యాదవ్‌

9 Nov, 2020 10:50 IST|Sakshi

పట్నా: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్‌- కూటమికే జైకొట్టిన వేళ తేజస్వి యాదవ్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఓట్ల కౌంటింగ్‌ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, క్రమ శిక్షణగా మెలగాలని చెప్పారు. తుది ఫలితాలు ఎలా ఉన్నా సహనం పాటించాలని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. బాణాసంచా కాల్చడం, రంగులు పూసుకోవడం, ప్రతిపక్ష పార్టీ వారితో రౌడీ చేష్టలు పనికిరావని అన్నారు. ఇక ఫలితాలు ఎలా ఉన్నా సంయమనం పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పూనుకోవద్దని ఆర్జేడీ ట్విటర్‌ వేదికగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌- రబ్రీ దేవి పాలనలో బిహార్‌లో రౌడీ రాజ్యం నడిచిందనే అవపవాదు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తేజస్వీ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ హెచ్చరికలు చేశారు. 

కాగా, బిహార్‌ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. మంగళవారం (నవంబర్‌ 10) ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి (మహా ఘటన్‌ బంధన్‌)  విజయం సాధిస్తే తేజస్వి యాదవ్‌ బిహార్‌ సీఎం పదవి చేపట్టనునన్నారు. ఇక బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు గాను మహా ఘటన్‌ బంధన్‌ 128 సీట్లు, ఎన్‌డీఏ కూటమి 99 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి. చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ 6 స్థానాలు గెలవొచ్చని తెలిపాయి. బిహార్‌లో మేజిక్‌ ఫిగర్‌ 122 సీట్లు. మరోవైపు క్షేత్ర స్థాయిలో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల కంటే ఎక్కువగానే సీట్లు సాధిస్తామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారి చెప్తున్నారు.

మరిన్ని వార్తలు