తొలి దశ ఓటింగ్‌ 54.26%!

29 Oct, 2020 03:55 IST|Sakshi

బిహార్‌లో ముగిసిన మొదటి విడత పోలింగ్‌

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ బుధవారం ముగిసింది. మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 54.26% ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అన్ని కేంద్రాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తరువాతే కచ్చితమైన ఓటింగ్‌ శాతం వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఈ జిల్లాల్లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54.75% పోలింగ్‌ జరిగింది.

ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో మొత్తంగా ఓటర్ల సంఖ్య సుమారు 2.15 కోట్లు కాగా, అభ్యర్థులు 1000కి పైగా ఉన్నారు. పోలింగ్‌ ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ.. సమయం గడుస్తున్న కొద్దీ పెరిగింది. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్, బిహార్‌ మాజీ సీఎం, హెచ్‌ఏఎం అధ్యక్షుడు జితన్‌ రామ్‌లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలి దశ ఎన్నికలు జరిగిన 71 స్థానాల్లో 35 స్థానాలు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలు. ఈ స్థానాల్లో పోలింగ్‌ను మధ్యాహ్నం 3 గంటలకే ముగించారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు సంతృప్తికరంగా ఉందని, అత్యంత స్వల్ప స్థాయిలో ఇబ్బందులు తలెత్తాయని ఎన్నికల సంఘం తెలిపింది.

2015లో ఐదు దశల్లో..
ప్రాథమిక సమాచారం మేరకు.. తొలిదశలో అత్యధిక ఓట్లు బంకా జిల్లాలో పోలయ్యాయి. అక్కడ 59.57% పోలింగ్‌ నమోదైంది. 2015లో ఈ జిల్లాలో నమోదైన ఓటింగ్‌ శాతం 56.43. అలాగే, ముంగర్‌ జిల్లాలో అత్యల్పంగా 47.36% మాత్రమే ఓటింగ్‌ జరిగింది. 2015లో ఇక్కడ 52.24% ఓటింగ్‌ నమోదైంది. 2015లో మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగగా, ఈ సారి 3 దశల్లోనే ఎన్నికలు ముగుస్తున్నాయి. 2015లో తొలి దశలో 10 జిల్లాల్లో విస్తరించిన 49 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. 2015 నాటి తొలి దశ ఎన్నికల్లో 54.94% పోలింగ్‌ జరిగినట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు.  

కాల్పులపై తీవ్ర నిరసన  
ముంగర్‌ కాల్పుల ఘటనపై విపక్షాలు బిహార్‌లో నితీశ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నితీశ్‌ పాలను బ్రిటిష్‌ రాజ్‌ తరహాలో ఉందని విమర్శిస్తూ, ముంగర్‌ కాల్పుల ఘటనను జలియన్‌వాలా బాగ్‌ కాల్పులతో పోల్చాయి. ముంగర్‌లో సోమవారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు సందర్బంగా ఘర్షణలు జరగడంతో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ లిపి సింగ్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కు సన్నిహితుడైన ఆర్‌సీపీ సింగ్‌ కూతురు కావడంతో విపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెంచాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు