బిహార్‌ సీఎం పదవిపై ఉత్కంఠ!

11 Nov, 2020 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ జనతాదళ్ (యునైటెడ్‌) పార్టీ 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. 73 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సీఎం పీఠం తమకే కావాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేసే అవకాశం లేకపోలేదు. ఈనేపథ్యంలో జూనియర్‌ స్థాయికి పడిపోయిన జేడీయూకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అభీష్టం మేరకే మంత్రివర్గం కూర్పు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కీలక మంత్రి పదవులు, స్పీకర్ పదవి తమకే కావాలని బీజేపీ స్పష్టం చేసినట్టుగా సమాచారం.
(చదవండి: ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?)

అయితే, ముందుగా అనుకున్నట్టుగా సీఎం పదవి నితీష్‌కు ఇస్తామని, దానిలో ఎలాంటి అనుమానాలకు తావులేదని బీజేపీ సీనియర్‌ నేత, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ తెలిపారు. మరోవైపు జేడీయూపై బిహార్‌ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిన క్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. సీఎంగా నితీష్‌ ఉన్నప్పటికీ రిమోట్‌ తమ చేతిలోనే ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా మచ్చలేని నాయకుడిగా పేరున్న నితీష్‌ కుమార్‌ ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. ఇక బిహార్‌లో ఎన్‌డీఏ కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన బీజేపీ కార్యకర్తలు, ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం ప్రసంగించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
(చదవండి: బీజేపీదే బిహార్‌)

మరిన్ని వార్తలు