మణిపూర్‌ సీఎం రాజీనామా హైడ్రామా.. బీరేన్‌ సింగ్‌కు మద్దతుగా మహిళలు

30 Jun, 2023 19:32 IST|Sakshi

మణిపూర్‌: అల్లర్ల దృష్ట‍్యా మణిపూర్‌లో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా హైడ్రామా చోటుచేసుకుంది. మణిపూర్‌లో కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాకాండపై సీఎం బీరేన్ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. దీంతో సీఎం ఈ రోజు రాజీనామా చేయడానికే నిశ్చయించుకున్నారు. కానీ భారీ సంఖ్యలో మహిళలు సీఎం ఇంటికి వచ్చి మద్దతు తెలపడంతో సీఎం తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

రెండు నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. అల్లరిమూకలు రెచ్చిపోవడంతో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అల్లర్లు తగ్గకపోవడంతో సీఎం బీరేన్ సింగ్‌పై అసహనం మొదలైంది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. రాష్ట్ర ప్రజలు సీఎంపై నమ్మకం కోల్పోయారని 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. కేంద్రం చొరవ తీసుకోవాలని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. 


 
ఈ డిమాండ‍్లపై విసిగిపోయిన సీఎం బీరేన్ సింగ్ కూడా రాజీనామాకు పూనుకున్నారు. గవర్నర్ నివాసానికి బయలుదేరే సమయంలో చాలా మంది మహిళలు గుంపులుగా సీఎం నివాసానికి వచ్చారు. రాజీనామా చేయకూడదని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సీఎం రాజీనామా లేఖ చినిగిన పేపర్ ముక్కలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల అనంతరం తాను రాజీనామా చేయట్లేదని సీఎం బీరేన్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లు హింసాకాండగా మారాయి. సైన్యానికి అ‍ల్లరిమూకలకు మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే 100 మంది మరణించారు. ఈ ఘర్షణ ప్రాంతాల్లో ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పర్యటిస్తున్నారు. 

ఇదీ చదవండి: మణిపూర్ హింస ఎఫెక్ట్‌.. సీఎం బీరేన్‌ సింగ్‌ రాజీనామా?

మరిన్ని వార్తలు