అమిత్‌ షా యాక్షన్‌ప్లాన్‌.. ఢిల్లీలో మెగా మీటింగ్‌.. ఇంక ఆ సీట్లపైనే గురి

6 Sep, 2022 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రాంతీయ పార్టీ నేతల దూకుడు.. విపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో..  2024 ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన వ్యూహకర్త అమిత్‌ షా అధ్యక్షతన పార్టీ  మెగా సమావేశం జరిగింది. 

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మంత్రులను కొన్ని స్థానాలపైనే దృష్టిసారించమని అమిత్‌ షా సూచించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు వెళ్లి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. ఫీడ్‌బ్యాక్‌ అందించాలని అమిత్‌ షా మంత్రులకు సూచించినట్లు సమాచారం. అంతేకాదు ఆయా స్థానాల్లో పార్టీని గ్రౌండ్‌ లెవల్‌లో బలపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని షా చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌, తెలంగాణతో పాటు బీజేపీకి అవకాశాలు ఉన్న మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫోకస్‌ చేయాలని ఆయన కేంద్రమంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

ఆ 144 సీట్లే!
బీజేపీ మేధోమదన సమావేశంలో షా సూచించిన కొన్ని స్థానాల సంఖ్య 144గా తేలింది. అవేంటంటే..  2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెల్చుకుంది. ఎన్డీయే కూటమిగా మొత్తం 353 సీట్లకు బలం పెంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్‌ శాతం 37.36గా వచ్చింది. 1989 ఎన్నికల తర్వాత.. ఒక పార్టీకి ఇంత ఓటు షేర్‌ రావడం ఇదే ప్రథమం. అయితే.. ఆ ఎన్నికల్లో 144 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాలతో ఓడిపోయారు. ఈ తరుణంలో ఆ 144 సీట్లే ప్రధానంగా దృష్టిసారించాలని అమిత్‌ షా మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు

మరిన్ని వార్తలు