రణరంగమైన విధాన పరిషత్

16 Dec, 2020 02:53 IST|Sakshi
విధాన పరిషత్‌ చైర్మన్‌ పీఠం వద్ద రభస దృశ్యం

కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు

డిప్యూటీ చైర్మన్‌ను కుర్చీ మీద నుంచి లాగేసిన కాంగ్రెస్‌ సభ్యులు 

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎగువసభ విధాన పరిషత్‌ మంగళవారం రణరంగమైంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు చైర్మన్‌ పీఠం కోసం ముష్టియుద్ధానికి, దూషణలకు దిగడంతో చట్టసభ చరిత్రలోనే చీకటిరోజుగా మిగిలిపోయింది. చైర్మన్‌ స్థానంలో కూర్చొన్న డిప్యూటీ చైర్మన్‌ను కిందకి లాగిపడేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రతాప్‌చంద్రశెట్టి ప్రస్తుతం విధాన పరిషత్‌ చైర్మన్‌గా ఉండగా, ఆయనను తొలగించాలని బీజేపీ జేడీఎస్‌తో కలిసి చేసిన ప్రయత్నంతో ఈ రగడ చెలరేగింది. మంగళవారం ఉదయం 11.10 గంటలకు డిప్యూటీ చైర్మన్‌ ధర్మేగౌడ లోపలికి వచ్చి చైర్మన్‌ స్థానంలో కూర్చున్నారు. ఇక ప్రతాప్‌ చంద్రశెట్టి పరిషత్‌లోకి రాకుండా బీజేపీ సభ్యులు ప్రవేశ ద్వారాన్ని మూసేశారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహంతో చైర్మన్‌ సీటు వద్దకు తోసుకొచ్చారు.

బీజేపీ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ఉరికారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు డిప్యూటీ చైర్మన్‌ ధర్మేగౌడను సీటుపై నుంచి లాగి కిందకి తోసేశారు. బిత్తరపోయిన ధర్మేగౌడ సభలో తన సీటు వద్దకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ మళ్లీ ధర్మేగౌడను చైర్మన్‌ స్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చూసినా కాంగ్రెస్‌ సభ్యులు ఒప్పుకోలేదు.

చైర్మన్‌ లేనట్లయితే సభ నిర్వహించాల్సిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పాటిల్‌ను చైర్మన్‌ సీటులో కూర్చోబెట్టి రక్షణగా నిలిచారు. దీంతో గొడవ తారస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు బాహాబాహీకి దిగా రు. చైర్మన్‌ సీటు వద్ద రక్షణగా ఉన్న గాజు ఫలకాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు నారాయణ స్వామి పీకేశారు. మరికొందరు మైక్‌ను విరిచేసి, పేపర్లు చింపేశారు. మార్షల్స్‌ భద్రత మధ్యలో చైర్మన్‌ ప్రతాప్‌ చంద్రశెట్టి సభలోకి వచ్చి తన సీటులో కూర్చొన్నారు. ఆ తర్వాత ఆ గందరగోళంలోనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు