బెంగాల్‌లో బీజేపీకి మరో చేదు అనుభవం..

18 Jan, 2021 19:52 IST|Sakshi

బీజేపీ ర్యాలీ.. రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాల కార్యకర్తలు

దీదీని ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పకుంటా: సువేందు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మరో సారి చేదు అనుభవం ఎదురయ్యింది. గతంలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయగా.. ప్రస్తుతం బీజేపీ నాయకుడు సువేందు అధికారి పాల్గొన్న ర్యాలీలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఓటమి భయంతోనే టీఎంసీ నాయకులు మాపై దాడి చేశారు. వారంతా మిని పాకిస్తాన్‌కు చెందిన వారు’ అన్నారు. (చదవండి: వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్)

వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ హింస చోటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఏప్రిల్‌- మే నెలల్లో జరగబోయే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో పాగా వేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు పరివర్తన్‌ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు వాటర్‌ బాటిళ్లు విసిరారు. అంతేకాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ జెండాలను పట్టుకొన్న కొందరు వ్యక్తులు ‘గో బ్యాక్‌’ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో దక్షిణ కోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గతేడాది జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కూడా కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఇక మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై సువేందు స్పందించారు. ఆమెని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఆమెని(దీదీ) నందిగ్రామ్‌లో అర లక్ష ఓట్ల తేడాతో ఓడిస్తాను. లేదంటే రాకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. 

మరిన్ని వార్తలు