కేసీఆర్‌కు ఏటీఎం కాళేశ్వరం.. అవినీతి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం

3 Aug, 2022 03:43 IST|Sakshi
సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి షెకావత్, బండి సంజయ్‌. చిత్రంలో రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరులు

ఇంజనీరింగ్‌ లోపంతో నీట మునిగిన పంప్‌హౌస్‌

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ధ్వజం

యాదగిరిగుట్టలో బీజేపీ బహిరంగ సభ

బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం 

సాక్షి, యాదాద్రి: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్‌.. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పంపుహౌస్‌లు నీట మునిగా­యన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కేసీఆర్‌కు డబ్బు తీసుకునే ఏటీఎం అయ్యిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులూ లేవని, జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పారు. ‘కేసీఆర్‌ అక్రమ ప్రాజెక్టు (సంతానం)కు మోదీని తండ్రి కావాలంటూ జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. జరిగిన తప్పులకు కేసీఆర్‌ బాధ్యత వహించాలి’ అని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో షెకావత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి షెకావత్‌ మాట్లాడారు. ‘రాష్ట్రంలో అవినీతిపరులను జైల్లో వేసేందుకే బీజేపీకి అధికారం ఇవ్వాలి. అణగారిన కులాలంటే కేసీఆర్‌కు గిట్టదు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వలేదు. కేసీఆర్‌ వినూ.. బండి సంజయ్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది’ అని అన్నారు. ముందుగా ‘సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, స్వాగతం..’ అంటూ షెకావత్‌ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

కేసీఆర్‌ను తరిమికొట్టాలి: బండి 
రాక్షస పాలన చేస్తున్న కేసీఆర్‌ను ప్రతీ బీజేపీ కార్యకర్త ఉగ్ర నరసింహుడై తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ వందల కోట్లు పెట్టి యాదాద్రి ఆలయాన్ని నాణ్యత లేకుండా నిర్మించారని ఆరోపించారు. కొట్లాడి తెచ్చు­కు­న్న తెలంగాణలో బుక్కెడు బువ్వ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు పురుగులు, బొద్దింకల అన్నం తింటున్నారని, అదే అన్నం కేసీఆర్‌ కుటుంబం తింటుందా అని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌ అయిన నయీమ్‌ నివా­సం నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యు­మెంట్లు, డైరీ, డబ్బులు ఏమయ్యాయో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అవన్నీ కక్కిస్తామన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ మాఫి­యా, క్యాసినో, భూ కబ్జాల్లో టీఆర్‌ఎస్‌ నేత­లే ఉన్నారని ఆరోపించారు. ‘కేసీఆర్‌ ఢిల్లీకి ఎప్పుడు పోయాడో, ఎప్పుడు వచ్చా­డో ఎవ­రి­కీ తెలియదు. ఆయన ఢిల్లీకి జఫర్‌ స్కాచ్‌ మం­దు కోసమే పోయిండు’ అని ఎద్దేవా చేశారు.

గద్దె దించడానికి ఎమ్మెల్యేలు సిద్ధం: ఈటల
కేసీఆర్‌ను గద్దె దించడానికి చాలామంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పారు. ‘నేను కారులో వస్తుండగా.. ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్‌ చేసి, రాజేందర్‌ గారూ.. మేము బీజేపీ వైపు చూస్తున్నామని చెప్పారు’ అని పేర్కొ­న్నారు. హుజూరాబాద్‌లో ఏవిధంగానైతే కేసీఆర్‌ను ఓడించామో అదేవిధంగా నల్లగొండ జిల్లాలోనూ ఓడిస్తామన్నారు. ఎందెందు వెతికినా, ఎవరిని కదిలించినా, ఒకటే నినాదమని, అది కేసీఆర్‌ను బొంద పెట్టడమేనని చెప్పారు. బీజేపీ జాతీయ ఉపా««­ద్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. యా­దా­ద్రి లక్ష్మీనరసింహ స్వామిని కూడా సీఎం కేసీఆర్‌ మోసం చేశాడన్నారు. 

అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడదాం: కిషన్‌రెడ్డి
తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్‌ శాపంగా మారాడని, మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మ అయ్యాడని కేంద్ర మంత్రి కిషన్‌­రెడ్డి దు­య్య­బట్టారు.  అవినీతి టీఆర్‌ఎస్‌ ప్రభు­త్వాన్ని తరిమికొట్టాలని ప్రజలను కోరా­రు. కేంద్ర నిధులను కేసీఆర్‌ దారిమ­ళ్లిస్తున్నారని ఆరోపించా­రు. రీజి­నల్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్రం నిధులు ఇచ్చిందని, తెలంగాణలో జాతీయ రహ­దా­రు­లను కేంద్రమే నిర్మి­స్తోం­దని తెలిపారు. భువనగిరిలో ఎయి­మ్స్‌ హాస్పి­టల్‌ పెడితే టీఆర్‌ఎస్‌ వాళ్లు వచ్చి ఎయిమ్స్‌లో ఏం లేదని వ్యా­ఖ్యా­నిస్తున్నారని, హరీశ్‌రావుకు ఆ మా­త్రం తెలియదా అని ప్రశ్నించారు. రూ.­900 కోట్లతో ఎయిమ్స్‌లో నూతన భవనం కడుతున్నామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సభలో ఎంపీ ధర్మ­పురి అరవింద్, ఎమ్మె­ల్యేలు రాజా­సింగ్, ర­ఘు­నందన్‌రావు తదితరు­లు పాల్గొన్నారు.  

తొలిరోజు 10 కిలోమీటర్లు 
యాదగిరిగుట్ట/ యాదగిరిగుట్ట రూరల్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. సంజయ్‌ ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అనంతరం యాదగిరిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు చేరుకున్నారు. సభ అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్రగా ముందుకు సాగారు.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, రోడ్డు విస్తరణ బాధితులు, ఆటో డ్రైవర్లు, టాంగా కార్మికులతో కలిసి మాట్లాడారు. పాదయాత్ర వికలాంగుల కాలనీ నుంచి పాతగుట్ట, గొల్లగుడిసెల మీదుగా దాతరుపల్లికి చేరుకుంది. సుమారు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రతో రోడ్లన్నీ బీజేపీ శ్రేణులతో నిండిపోయాయి. దాతరుపల్లి, బస్వాపూర్‌ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన శిబిరంలో బండి రాత్రి బస చేశారు. కాగా, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, కిషన్‌రెడ్డితోపాటు డీకే అరుణ తదితరులు దర్శించుకున్నారు.   

మరిన్ని వార్తలు