బాంచెన్‌ బతుకులు పోయి కాలర్‌ ఎగరేసే పరిస్థితి రావాలి

17 Aug, 2022 02:34 IST|Sakshi

జనగామ/హైదరాబాద్‌: ‘రజాకార్ల వారసుల పార్టీ ఎంఐఎం.. వారిని చంకలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ తిరుగుతున్నారు. ఆ రెండు పార్టీలు ఒకటే.. వీరిద్దరి రాక్షసరాజ్యం పోయి.. తెలంగాణలో త్వరలోనే బీజేపీతో రామరాజ్యం వస్తుంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగింది. విస్నూరు, వడ్డెర కాలనీ, లక్ష్మినారాయణపురం స్టేజీ మీదుగా పాలకుర్తి పట్టణానికి చేరుకుంది.

అక్కడ ఏర్పాటు చేసినసభలో సంజయ్‌ మాట్లాడుతూ బానిస, బాంచెన్‌ బతుకులు పోయి, కాలర్‌ ఎగరేసే పరిస్థితి మన రాష్ట్రంలో రావాలన్నారు. తెలంగాణకు ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వి రూపంలో కేసీఆర్‌ దాపురించారని ధ్వజమెత్తారు. తన యాత్ర సందర్భంగా దుకాణాలు మూసి వేయించిన వరంగల్‌ పోలీసు కమిషనర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా మారిపోయారని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణలకు ఏమీ చేయడం లేదంటూ ప్రధాని మోదీని తిడు తూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సీఎంపై మండిపడ్డారు. పేదలకు రైతుబంధు ఇవ్వని కేసీఆర్, పెద్దోళ్ల ఖాతాలో మాత్రమే నగదు జమచేస్తున్నారని ఆరోపించారు.   

వెయ్యి కి.మీ. మైలురాయికి పాదయాత్ర 
బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం వెయ్యి కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం కోలుకొండ స్టేజీసమీపంలో ఈ ఘనతను సాధించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. మొదటి విడత పాదయాత్ర గతేడాది ఆగస్టు 28న హైదరాబాద్‌ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల యం వద్ద ప్రారంభమైన విషయం తెలిసిందే.

కేసీఆర్‌ స్కీమ్‌లన్నీ అట్టర్‌ఫ్లాప్‌: సంజయ్‌
సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన స్కీంలన్నీ అట్టర్‌ఫ్లాపేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. వికారాబాద్‌ వేదికగా కేసీఆర్‌ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేన్నారు. మునుగోడు సెగతో గాయిగాయి చేస్తున్న కేసీఆర్‌ సుపరి పాలనలో మోదీ కాలి గోటికి సరిపోరని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎన్నిక లొస్తేనే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వస్తారని మరోసారి నిరూపిత మైందని, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో వికారాబాద్‌లో సభపెట్టి మరోసారి కేసీఆర్‌ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

తాను చెబుతున్నది అబద్ధమని తెలిసీ మొహమాటం, సిగ్గు లేకుండా వికా రాబాద్‌ సభలో మాట్లాడటం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. వికారాబాద్‌ జిల్లాకు సాగు, తాగునీటి సౌకర్యం లేకుండా చేసింది  కేసీఆరే అని అన్నారు.  మిగు లు రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్లకుపైగా అప్పుల్లో ముంచేసి, పుట్టబోయే ఒక్కో బిడ్డపైన రూ.1.20 లక్షల అప్పుభారం మోపిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. లాభాల్లో సింగరేణిని రూ.20వేల కోట్ల అప్పులపాల్జేసిన ఘనుడు కేసీఆర్‌ అని అన్నారు.
చదవండి: తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక అడుగడుగునా ప్రధాని అడ్డంకులు  

మరిన్ని వార్తలు