సింగర్‌ కేకే మృతిపై వివాదం

2 Jun, 2022 04:43 IST|Sakshi
కేకే చివరి షోకు పోటెత్తిన అభిమానులు

కోల్‌కతా: ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు కేకే అకాల మర ణంపై రాజకీయ రగడ జరుగుతోంది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన అనంతరం హోటల్‌ చేరుకుంటూనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలడం తెలిసిందే. ప్రదర్శనకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేసింది. ‘‘మూడు వేల మంది పట్టే ఆడిటోరియంలో రెట్టింపుకు పైగా జనం వచ్చారు. కేకేను పూర్తిగా చుట్టుముట్టారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్‌ భట్టాచార్య ఆరోపించారు. అనవసరంగా రాబందు రాజకీయాలు చేయొద్దంటూ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ వీటిని తిప్పికొట్టింది.

కేకే మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘మంగళవారం రాత్రి ప్రదర్శన తర్వాత హోటల్‌ లాబీల్లో ఆయనను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. ఒకరిద్దరితో సెల్ఫీ దిగాక పై అంతస్తులోని తన గదిలోకి వెళ్లబోతూ తూలి పడిపోయారు’’ అని వివరించారు. ఆయన నుదిటిపై, పెదవులపై రెండు గాయాలున్నాయన్నారు. సీఎం మమతా బెనర్జీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గొప్ప గాయకున్ని కోల్పోయామన్నారు. భార్య, ఇతర కుటుంబీకులను ఓదార్చారు. కేకే అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.  
 

మరిన్ని వార్తలు