15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌

9 Oct, 2023 04:34 IST|Sakshi

14న అమావాస్య కావడంతో ఆ తర్వాత ప్రకటించాలన్న యోచనలో రాష్ట్ర నాయకత్వం 

21 చోట్ల ఏకాభిప్రాయం.. మిగతావాటిపైనా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం 

మొత్తం మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా 

సాక్షి , హైదరాబాద్‌: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్‌కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది.

ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్‌గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్‌సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది.

దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు