బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం 

8 Feb, 2023 03:29 IST|Sakshi

కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగే  

దమ్ముంటే ఎంఐఎం 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

తుర్కయాంజాల్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో జరిగిన స్పీకర్స్‌ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రోజురోజుకు బీజేపీ దూసుకెళ్తుండటంతో ఆత్మరక్షణలో పడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఫామ్‌హౌస్‌ వదిలి దేశమంతా తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావడం లేదని, ఆ పార్టీకి ఓటేస్తే తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికే చేరతారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందన్నారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్, ఎంఐఎం పరస్పరం సవాల్‌ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించాయని, నిజంగా ఎంఐఎంకు దమ్ముంటే 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులను ప్రోత్సహించడం, కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే కార్నర్‌ మీటింగ్‌ల ఉద్దేశమని, ఒక్కో స్పీకర్‌ మీకు కేటాయించిన 10 సభలకు హాజరై ప్రజలకు బీఆర్‌ఎస్‌ అక్రమాల గురించి వివరించాలని చెప్పారు. ఇలా 11వేల మీటింగ్‌లు విజయవంతం చేస్తే రాష్ట్రంలో బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. 

కృష్ణాజలాలపై మోసం చేశారు.. 
కృష్ణా జలాల్లో 68 శాతం వాటాతో 570 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉన్నా.. 299 టీఎంసీలకే సంతకం పెట్టి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుపై లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి నీటిని వాడుకోవాలని మహారాష్ట్రకు హామీ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు అందలేదన్నారు.

కేంద్రం 2.40 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తే వాటిని దారి మళ్లించారని, వివరాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నాలుగు సార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ నెల 20 తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా.. మాజీ ఎంపీలు మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, రవీందర్‌ నాయక్, విజయరామారావు, మాజీ మంత్రి బాబూమోహన్‌ పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు