రాష్ట్రానికి పీడ విరగడైంది

14 Dec, 2022 00:48 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్‌  

కేసీఆర్‌ తెలంగాణ తల్లికి ద్రోహం చేసిండు 

బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌

జగిత్యాల, మల్యాల(చొప్పదండి): సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి పోయిండు.. తెలంగాణ ప్రజలకు పీడ విరగడైంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ తెలంగాణకు పట్టిన శని అని, టీఆర్‌ఎస్‌ నుంచి ‘తెలంగాణ’అనే పేరు తొలగించి తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని విమర్శించారు.

తెలంగాణతో ఉన్న బంధం ఇక కేసీఆర్‌కు తెగిపోయిందన్నారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయనపై యుద్ధం చేస్తే భయపడి ఢిల్లీకి పోయారని, భవిష్యత్‌లో విదేశాలకు పారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కూతురు కవిత లిక్కర్‌ దందాలో ఇరుక్కుపోయారని, ఆమెను విడిచిపెడదామా? అని ప్రశ్నించారు. 

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో పైలెట్‌ రోహిత్‌రెడ్డి.. 
బెంగళూర్‌ డ్రగ్స్‌ కేసులో పైలెట్‌ రోహిత్‌ ఉన్నారని సంజయ్‌ ఆరోపించారు. డ్రగ్స్‌ కేసు విచారిస్తున్న కొందరు బెంగళూర్‌ అధికారులు. హైదరాబాద్‌ అధికారులు సీఎంవోకు వివరాలు లీక్‌ చేస్తున్నారని అన్నారు. తనపై లీగల్‌ టీం ఎంక్వైరీ చేసిన విషయం రోహిత్‌రెడ్డికి తెలియదని, ఒక వేళ తెలిస్తే రోహిత్‌రెడ్డి వాస్తవాలు చెబుతాడని సీఎం భయపడ్డారని వ్యాఖ్యానించారు. అందుకే హడావుడిగా ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డితో సెక్షన్‌ 164 కింద జడ్జి ఎదుట వాంగ్మూలం ఇప్పించారన్నారు. 

కేసీఆర్‌వి జూటా మాటలు 
‘కేసీఆర్‌వి జూటా మాటలు.. కొండగట్టు బస్సు దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు కన్నీరు పెట్టినా.. సీఎంలో చలనం లేదు.. బా«ధిత కుటుంబాలను కనీసం పరామర్శించిందిలే.. రూ.లక్ష కూడా పరిహారం ఇవ్వలేదు.. అలాంటి సీఎం.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తారా’ అని సంజయ్‌ నిలదీశారు.. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా మంగళవారం కొండగట్టులో పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతులకు నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం.. కొండగట్టు ప్రమాద బాధితుల ఊసెత్తకపోవడం సిగ్గుచేటనీ.. ఆయనకు పేదోళ్ల ఉసురు తగుల్తది అని బండి శాపనార్థాలు పెట్టారు. ‘తెలంగాణలో ఏం పీకినవ్‌ అని.. దేశ రాజకీయాల్లో ఏం పీకుతావని’ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజాబ్, గుజరాత్, యూపీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తా అంటడు.. నిన్ను ఎవరు పిలిచారు.. దేశంలో కేసీఆర్‌ అంటే కూడా ఎవరికీ తెలియదు. కవితకు బతుకమ్మ ఆడవచ్చా.. డీజే డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులతో బతుకమ్మ సంస్కృతిని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరుగుతుంటే కళ్లలో ఎందుకు నిప్పులు చెరగడం లేదు.. కవితా నీకు బాధ వస్తేనే నిప్పులు చెరుగుతాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు