‘బయ్యారం స్టీల్‌’పై కేసీఆర్‌వి అబద్ధాలు: సంజయ్‌ 

31 Jan, 2023 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ /ఖైరతాబాద్‌: బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల డీజీపీ ఆఫీస్‌ ముట్టడిలో గాయపడ్డ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ను సోమవారం గ్లోబల్‌ ఆసుపత్రిలో సంజయ్‌ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బయ్యారంపై డీపీఆర్‌ ఇవ్వాలన్న తమ లేఖకు మూడున్నరేళ్లుగా స్పందనే లేదని కేంద్రం స్పష్టం చేసినందున ఇప్పుడు కేసీఆర్‌ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ‘బడ్జెట్‌ ఫైల్‌కు మూడురోజులుగా గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపడం లేదని కోర్టుకెక్కిన కేసీఆర్‌... ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫైల్‌ను ఏళ్ల తరబడి అసెంబ్లీ స్పీకర్‌ పెండింగ్‌లో పెడితే ఎందుకు మాట్లాడటం లేదు?’అని నిలదీశారు.

కేసీఆర్‌ పాలనలో సర్పంచ్‌లు కూడా ఆత్మహత్యలు చేసు కునే దుస్థితి ఏర్పడిందన్నారు.  కాగా, కేసీఆర్‌ కుటుంబసభ్యులు తాము నిజాం రాజులమనిæ అనుకుంటున్నారని, వారు  ఏ ప్రాంతానికి వెళ్లినా ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని సంజయ్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ కమలాపూర్‌ పర్యటన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు