టీచర్లను బేషరతుగా విడుదల చేయండి 

23 Jan, 2023 02:13 IST|Sakshi

వారి డిమాండ్లను పరిష్కరించండి: బండి సంజయ్‌ డిమాండ్‌    

సాక్షి, హైదరాబాద్‌: అరెస్ట్‌ చేసిన టీచర్లను బేషరతుగా విడుదల చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ సర్కార్‌ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘కేసీఆర్‌... పసిపిల్లలు ఏడుస్తున్నా నీ మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్‌ చేస్తారా? ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప మానవ సంబంధాలు, భావోద్వేగాలు నీకు పట్టవా? మానవత్వం లేదా’అని ప్రశ్నించారు.

భార్యభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని అడగడమే నేరమా అని నిలదీశారు. కనీసం ఈ అంశంపై వారితో చర్చించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం సిగ్గు చేటన్నారు. 317 జీవోను సవరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న టీచర్లపట్ల పోలీసులు అనుసరించిన వైఖరి అత్యంత అమానుషంగా ఉందన్నారు. భార్యను ఒక దగ్గర, భర్తను మరోచోట బదిలీ చేయడం అన్యాయమని, దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చాక 317 జీవోను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు