‘పోడు’ పట్టాలివ్వకుంటే ఫామ్‌హౌస్‌ను దున్నేస్తారు

11 Feb, 2023 02:41 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరిక

పోడు భూములపై కేసీఆర్‌ కొత్త నాటకాలు

ఆత్మహత్యలు జరుగుతున్నా స్పందించరు

పాతబస్తీలో ఏటా రూ.వెయ్యి కోట్ల విద్యుత్‌ చౌర్యమంటూ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మానవమృగంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటర్‌ విద్యార్థులు మొదలుకుని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం స్పందించని నరరూప రాక్షసుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలన మానవత్వానికి చిరునామా అంటూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

ఎనిమిదేళ్లుగా పోడు భూములకు పట్టాలివ్వకుండా సాగతీత ధోరణి అనుసరించి ఇప్పుడు మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామాలకు తెరదీశారని మండిపడ్డారు. ఈసారి పోడు భూములకు పట్టాలివ్వకుంటే పేదలంతా ఫామ్‌హౌస్‌ను ఆక్రమించుకుని దు­న్నడం ఖాయమని హెచ్చరించారు. ‘అఖిలపక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తులో పోడు సాగు చేయబోమని హామీ ఇస్తేనే పట్టాలిస్తానని కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పడం సిగ్గు చేటు.

ఉప ఎన్నికల సమయంలో ఈ మాట ఎందుకు చెప్పలేదు? మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామా చేస్తున్నదెవరు?’ అని అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల సెస్‌ మాజీ వైస్‌ చైర్మన్, శ్రీనివాస చారిట బు­ల్‌ ట్రస్ట్‌ అధినేత లగిశెట్టి శ్రీనివాస్‌ సహా పలువురు సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

కూల్చే సంస్కృతి ఎవరిది?
తాము కడుతుంటే కొందరికి కూల్చే సంస్కృతీ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. ‘అసలు సచివాలయాన్ని కూల్చిందెవరు? కూల్చే సంస్కృతి ఎవరిది? మీ తండ్రి సచివాలయానికే పోనప్పుడు కూల్చాల్సిన అవసరం ఏముంది? సచివాలయంలో పోచమ్మ తల్లి ఆలయాన్ని కూల్చిందెవరు? ప్రజలను కలవని ప్రగతి భవన్‌ను ఎందుకు కట్టుకున్నవ్‌? పేదలకు ఉపయోగపడే ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. దానిని కూల్చి కొత్త భవనం ఎందుకు కట్టడం లేదు’ అని బదులిచ్చారు. 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి
పాతబస్తీలో విద్యుత్‌ బకాయిల్లేవంటూ ఎంఐఎం నేతలు, బీæఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని సంజయ్‌ వ్యాఖ్యానించారు. పాతబస్తీలో ఏటా రూ.వెయ్యి కోట్ల విద్యుత్‌ చౌర్యం జరుగుతోందని, తనతో వస్తే నిరూపించేందుకు సిద్ధమని సంజయ్‌ సవాల్‌ విసిరారు. జర్నలిస్టుల సంక్షేమంలో తమ ప్రభుత్వం నంబర్‌ వన్‌ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని 1,100 మంది జర్నలిస్టులకు నిజాంపేట, పేట్‌ బషీరాబాద్‌లో తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా అమలు చేయని దుర్మార్గుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. ‘జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వాలని ప్రతిపాదన పంపితే కేంద్రంతో మాట్లాడి వారం రోజుల్లో మంజూరు చేయిస్తా’ అని చెప్పారు.  

మరిన్ని వార్తలు