గవర్నర్‌ చేయాల్సింది ఇలాగే: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

26 Sep, 2023 08:06 IST|Sakshi

కేసీఆర్‌ తన కుటుంబానికి సేవచేసే వారిని ఎమ్మెల్సీలు చేయాలని చూస్తున్నారు: కిషన్‌రెడ్డి 

ఆ ప్రతిపాదనలను తమిళిసై సాహసోపేతంగా తిరస్కరించారు

సాక్షి, హైదరాబాద్‌: నామినేటెడ్‌ ఎమ్మెల్సీల నియా మకం విషయంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పా రు. గవర్నర్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని.. ఆమెకు రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. గవర్నర్‌ కోటా, రాష్ట్రపతి కోటా పదవులు అంటే మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సినవని స్పష్టం చేశారు.

కేసీఆర్‌కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా క్రిమినల్‌కేసులున్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలు పంపితే గవర్నర్‌తిరస్కరించారని గుర్తుచేశారు.

‘‘బీఆర్‌ఎస్‌ ఎవరికి టికెట్లు ఇస్తుందంటే.. కేసీఆర్‌ కాళ్ల దగ్గరపడి ఉండేవాళ్లకు, వాళ్ల మోచేతి నీళ్లు తాగేవాళ్లకు, ఆత్మగౌరవం లేని వాళ్లకు ఇస్తుంది. గవర్నర్‌కోటా నామినేటెడ్‌పోస్టులు కూడా అలాంటి వారికే ఇవ్వాలంటారా? అనేక పార్టీలు ఫిరాయించిన వారు, కేసీఆర్‌కుటుంబానికి మాత్రమే సేవచేసే వారిని గవర్నర్‌తిరస్కరించారు. అలాగే చేయాలి కూడా. ఈ విషయంలో గవర్నర్‌నిర్ణయం స్వాగతించదగినది..’’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

రాజకీయాలకు అతీతంగా ఉండాలి 
ప్రధాని మోదీ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా బీజేపీకి ఏమాత్రం సంబంధం లేని సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ను, పీటీ ఉష వంటి అంతర్జాతీయ క్రీడాకారిణిని ఎంపీలుగా ప్రతిపాదించగా రాష్ట్రపతి ఓకే చేశారని కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో గవర్నర్‌ సరిగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలను ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటేనే గవర్నర్‌ సరిగా వ్యవహరించినట్టా? కేసీఆర్‌ తప్పిదాలను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే సరికాదా? గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఆ పదవికి ఏ పార్టీతో సంబంధం ఉండదు’’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు