విపక్షాలు చిత్తు.. బీజేపీ క్లీన్‌స్వీప్‌

10 Nov, 2020 14:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు  ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది.   ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఉప ఎన్నికలు జరగుతున్న మొత్తం 8 స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా దూసుకెళుతోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన  ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే సిట్టింగ్‌ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. దీంతో గత అసెం‍బ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది.

ఇక కర్ణాటకలోనూ అధికార బీజేపీ అనుహ్య ఫలితాలను సాధించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆర్‌ఆర్‌ నగర్‌, శిర అసెంబ్లీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఈ రెండు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మరింత పెరుగనుంది. (సీఎం పీఠం నితీష్‌కు దక్కుతుందా?)

దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన మధ్య ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 6, బీఎస్పీ 1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఇక కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు.

బిహార్‌లోని అధికార ఎన్డీయే కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. జేడీయూ-బీజేపీ నేతృత్వంలోనే కూటమి 130 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమైంది.

 ఉప ఎన్నికల ఫలితాలు..

యూపీ (7): బీజేపీ 6, ఎస్పీ 1
ఒడిశా (2): బీజేడీ ఆధిక్యం
హర్యానా (1): కాంగ్రెస్ ఆధిక్యం 
జార్ఖండ్ (2)‌: బీజేపీ 1, కాంగ్రెస్‌ 1
మణిపూర్ (5): బీజేపీ 4, ఇతరులు 1
ఛత్తీస్‌గఢ్ (1)‌: కాంగ్రెస్ ఆధిక్యం
నాగాలాండ్ (2): రెండు స్థానాల్లోనూ ఇతరుల ఆధిక్యం

మరిన్ని వార్తలు