దుబ్బాక.. ఇక్కడ చెప్పబాక!

21 Mar, 2021 07:58 IST|Sakshi

దుబ్బాక ఫలితం తర్వాత బీరాలు పలికిన బీజేపీ నేతలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ఆ పార్టీ అభ్యర్థులు

తిరుపతి కార్పొరేషన్‌లో కనిపించని కమలం ప్రభావం

కుట్రలు, కుయుక్తులతో పోటీకి రంగం సిద్ధం

ప్రజామద్దతుతో ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ 

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసినట్టుంది బీజేపీ పరిస్థితి. దుబ్బాక ఫలితాన్ని బలంగా భావించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అది బలుపు కాదు వాపని తెలిసొచ్చింది. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుతామంటూ అతివిశ్వాసం వ్యక్తం చేస్తోంది. దుష్పచారాలు చేస్తూ లబ్ధిపొందాలనే ఎత్తుగడ వేస్తోంది. తోక పార్టీని వెంటబెట్టుకుని పేట్రేగిపోతోంది. ప్రజానాడిని పక్కనబెట్టి వైఎస్సార్‌సీపీపై కుట్రలకు తెరదీయడం విమర్శలకు తావిస్తోంది.  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘మా బలం పెరిగింది. తెలంగాణలోని దుబ్బాక విజయమే దీనికి నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రాలోనూ తమ పార్టీ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది’ అంటూ బీజేపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టారు. ఒకింత ఇది నిజమేననే భ్రమలోకి నెట్టారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అడ్రస్‌ గల్లంతవడంతో నోటికి తాళం వేశారు. మళ్లీ ఇప్పుడు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో తమదే విజయం.. అంటూ కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, పొత్తులకు తెరదీస్తున్నారు. దీనిపై విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

పట్టు.. ప్రజాదరణ ఏదీ? 
తిరుపతి పార్లమెంటు పరిధిలో బీజేపీ–జనసేన బలం చాలా స్వల్పం. ఈ రెండు పార్టీలకు కలిపి 2014 ఎన్నికల్లో 24 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 22 డివిజన్లు ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 8 డివిజన్లలో మాత్రమే బీజేపీ పోటీ చేయగలిగింది. అంటే తక్కిన 21 డివిజన్లలో బీజేపీకి అభ్యర్థులు కూడా లేరన్నమాట. పోటీచేసిన 8 డివిజన్లలో బీజేపీ సాధించిన మొత్తం ఓట్లు 2,546 మాత్రమే. జనసేన 2 డివిజన్లకు పరిమితమైంది. ఆ రెండుచోట్లా కలిపి ఆ పార్టీకి లభించిన ఓట్లు 231 మాత్రమే. క్షేత్ర స్థాయిలో అటు బీజేపీ, ఇటు జనసేన పట్టు, ప్రజాదరణ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. అలాంటి చోట సత్తా చాటుతాం.. దుబ్బాక ఫలితం రిపీట్‌ అవుతుంది.. అంటూ అదరగొట్టే స్పీచ్‌లు, స్టేట్‌మెంట్లు తిరుపతి పార్లమెంటు వాసులకు నవ్వు తెప్పిస్తున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ మరీ అధ్వానమైన స్థితిలో ఓట్లు సాధించింది. మూడు చోట్లా కలిపి వెయ్యికి లోపే ఓట్లు దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో బీజేపీది బలుపు కాదు, వాపు మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది.

అదే ధీమా 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తమదేనని వైఎస్సార్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుపటి ఫలితాలకంటే అధిక మెజారిటీ లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలను కూడా వివరిస్తున్నారు. సంక్షేమ పాలన, ఇటీవల వరుసగా ఎన్నికల ఫలితాలు అందుకు నిరద్శనమని చెబుతున్నారు. పైగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి తిరుపతి వాసులుకు సుపరిచితుడు కావడం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గెలుపు అతి సునాయసమన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పైగా దేశవ్యాప్తంగా అందరి చూపు తిరుపతి ఫలితం వైపు ఉండేలా మెజారిటీ సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయడంతో మరింత ఉత్సాహంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పనిచేస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.   

టీడీపీ బుజ్జగింపుల పర్వం 
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలు ఒక్కో పార్టీకి ఒక్కో విపత్కర పరిస్థితి తెచ్చిపెట్టింది. బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటికీ వెల్లడించకపోగా, మూన్నెళ్లకు ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ భంగపాటుకు గురవుతోంది. మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును అభ్యర్థిగా ప్రకటించింది. ఇష్టం లేకపోయినా అభ్యరి్థత్వానికి  ఎంపిక చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నా, టీడీపీ నేతలు బుజ్జగింపు చర్యల్లో నిమగ్నమైనట్టు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ప్రకటించిన అభ్యర్థి పోటీ నుంచి విరమిస్తే, పార్టీ పరువు పోతుందని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆమె ఎదుట ఆవేదన చెందినట్లు సమాచారం.
చదవండి:
స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్‌ రికార్డ్‌  
నగ్నంగా నామినేషన్‌ వేసేందుకు వచ్చి.. 

మరిన్ని వార్తలు