‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్‌ ఎన్నుకోండి’

20 Jan, 2022 19:45 IST|Sakshi
ఉత్పల్‌ పారికర్‌

పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు నిరాశ తప్పలేదు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పాత నియోజకవర్గం పనాజీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని పదే పదే అభ్యర్థించినప్పటికీ ఉత్పల్‌ పారికర్‌కు ఆ సీటు దక్కలేదు.  ఈరోజు(గురువారం)బీజేపీ విడుదల చేసిన గోవా అసెంబ్లీ తొలి దశ జాబితాలో పనాజీ స్థానం కూడా ఉంది. అయితే ఆ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే అటానాసియో మోన్‌సెర్రెట్‌కు కట్టబెట్టారు. 34 మందితో విడుదల చేసిన తొలి  లిస్టులో పనాజీ స్థానాన్ని అటానాసియోకు ఇవ్వడంతో ఉత్పల్‌ పారికర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 

కాగా,  ఉత్పల్‌ పారికర్‌కు పనాజీ స్థానాన్ని ఇవ్వడం కుదరలేదని గోవా ఎలక్షన్‌ ఇన్‌చార్జ్‌  దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. ఆ సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఇ‍వ్వాల్సి వచ్చిందని, అలాగనే పారికర్‌ ఫ్యామిలీని వదులుకోబోమని పేర్కొన్నారు. ‘మనోహర్‌ పారికర్‌ కుటుంబం.. తమతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. దాంతోనే పనాజీ స్థానం కాకుండా రెండు ఆప్షన్లు ఇచ్చాం. అందులో ఒక స్థానాన్ని ఉత్పల్‌ నిరాకరించారు. ఇంకో ఆప్షన్‌ మాత్రమే ఉంది. ఈ విషయంపై మేము ఆయనతో చర్చిస్తున్నాం. అందుకు ఉత్పల్‌ ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాం’ అని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. 

చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! పారికర్‌ కొడుక్కి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..

మరిన్ని వార్తలు