‘గోవా, త్రిపుర కాదు.. బెంగాల్‌పై దృష్టి పెట్టండి’

2 Jan, 2022 17:20 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ వైస్‌ ప్రెసిడెంట్‌ దిలీప్‌ ఘోష్‌ అధికార తృణమూళ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ త్రిపుర పర్యటనపై విరుచుకపడ్డారు. టీఎంసీ త్రిపురలో ఏం చేయలేదని, అభిషేక్‌ బేనర్జీ అక్కడి వెళ్లడం దండగని ఎద్దేవా చేశారు. టీఎంసీ త్రిపురలో తన ఉనికిని నిలుపుకోలేదని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తారని తెలిపారు. బెంగాల్‌ ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని మండిపడ్డారు.

టీఎంసీ త్రిపుర, గోవాల రాష్ట్రాల వైపు చూడటం కాదని, ముందుగా బెంగాల్‌ అభివృద్దిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. గోవా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మంగా భావించే.. 'దువారే సర్కార్' పథకం ప్రారంభం కావాల్సింది కాస్త నిధుల కొరత కారణంగా రద్దయిందని ఆరోపించారు.

ప్రణాళికలు, నిధుల కొరత వల్ల  ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు.  దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దిలీప్‌ ఘోష్‌ పరిశీలించాలని అన్నారు.

మరిన్ని వార్తలు