కేసీఆర్‌ పాలనకు చరమగీతం 

22 Sep, 2021 08:17 IST|Sakshi

సంజయ్‌ పాదయాత్రసభలో కేంద్ర మాజీమంత్రి జవదేకర్‌ పిలుపు 

సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ప్రజాపాలనకు బదులు కేసీఆర్‌ కుటుంబపాలన నడుస్తోందని, దీనికి చరమగీతం పాడాలని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లలో లక్ష మంది ఉద్యోగులు రిటైర్‌కాగా, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం మాత్రం ఆ ఖాళీలను భర్తీ చేయలేదని ఆరో పించారు.

సీఎం కేసీఆర్‌ మాయమాటలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిం చారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని, 2023 ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్‌ మాట్లాడుతూ కేంద్రం 2.91 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే సీఎం కేసీఆర్‌ 12 వేల ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారని ఆరోపించారు. మక్కలు కొనకుంటే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.  

300 కి.మీ. దాటిన ‘బండి’ 
సంజయ్‌ పాదయాత్ర మంగళవారం(25వ రోజు)  నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకోగానే 300 కి.మీ. పూర్తయినట్టు నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు నినాదాలు, చప్పట్లతో సంజయ్‌ను అభినందించారు.     
 

మరిన్ని వార్తలు