బిహార్‌: తొమ్మిది మందిపై వేటువేసిన బీజీపీ

13 Oct, 2020 11:46 IST|Sakshi

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంది. వీరంతా రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను తిరుగుబాటుదారులందరినీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో రాజేంద్ర సింగ్, రామేశ్వర్ చౌరేషియా, ఉషా విద్యార్తి, రవీంద్ర యాదవ్, శ్వేతా సింగ్, ఇందూ కశ్యప్, అనిల్ కుమార్, మృణాల్ శేఖర్‌, అజయ్ ప్రతాప్ ఉన్నారు. "మీరు ఎన్డీఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇది ఎన్డీఏతో పాటు పార్టీ ఇమేజ్‌ని కూడా దెబ్బతీస్తుంది. ఇది పార్టీ సూత్రాలకు విరుద్ధం. అందువల్ల, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మిమ్మల్ని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నాం" అని రాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ జైస్వాల్ వీరికి నోటీసులు జారీ చేశారు. (చదవండి: బిహార్‌ పోరు రసవత్తరం)

ఈ తొమ్మిది మంది ఈ సారి ఎన్డీఏ తరఫున టికెట్‌ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో వారు సొంత అభ్యర్థులపైనే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాజేంద్ర సింగ్, ఉషా విద్యార్తి, రామేశ్వర్ చౌరేషియా ఎల్జెపిలో చేరగా, అజయ్ ప్రతాప్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలో చేరారు. ఇక ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), హిందూస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) లతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలో దిగింది. సీట్ల భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, బీజేపీ 115 సీట్లలో, జేడీ(యూ) 110 సీట్లలో, వీఐసీ, హెచ్ఏఎమ్ (ఎస్) వరుసగా 11, 7 సీట్లలో పోటీ చేస్తాయి. ముఖ్యంగా, జేడీ(యూ)తో విభేదాల కారణంగా కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి అయిన లోక్ జన్‌శక్తి పార్టీ ఈ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. (పాశ్వాన్‌ మృతి: కుమారుడికి కష్టాలు..!)

బిహార్‌లో మూడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 28 న, రెండవ దశ నవంబర్ 3 న జరగాల్సి ఉండగా, చివరి దశ నవంబర్ 7 న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు