వలసలపై ఫోకస్‌

8 Dec, 2020 04:54 IST|Sakshi

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి చేరికలపై కమలం దృష్టి

అసంతృప్త నేతలతో ఇప్పటికే టచ్‌లోకి బీజేపీ

మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై మొదట ఫోకస్‌ 

మాజీ మంత్రితో చర్చలు!

సాక్షి, హైదరాబాద్‌: పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. వీలైనంత త్వరగా తెలంగాణ అంతటా బలోపేతం కావాలి. మిషన్‌– 2023 లక్ష్యంగా దూసుకెళ్లాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలనాథులు శరవేగంగా వ్యూహరచన చేస్తున్నారు. పకడ్బందీగా భవిష్యత్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ‘సర్జికల్‌ స్ట్రైక్‌’ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడు... ‘సాఫ్రాన్‌ స్ట్రైక్‌’కు పదును పెడుతోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను కాషాయదళంలోకి తీసుకురావడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఎవరెవరు వస్తారు, ఎవరైతే మనకు లాభం... అనే కోణంలో పార్టీల వారీగా... పక్కాగా జాబితాలను సిద్ధం చేస్తోంది.

పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి... అధినాయకత్వంతో భవిష్యత్తుకు భరోసా ఇప్పిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ను నడిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు 2023లో వచ్చినా, అంతకుముందే వచ్చినా.. సర్వసన్నద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టిపోటీనిచ్చిన స్థానాలు, ప్రజలు బీజేపీపై ఆదరణ చూపిన ప్రాంతాల్లో మొదట పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. వాటితో పాటు దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టేలా కార్యాచరణ అమలులో పెట్టనుంది. 

పక్కాగా చేరికల వ్యూహం
అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. వారిలో మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, వీరేందర్‌గౌడ్, బొడిగె శోభ తదితరులున్నారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌లను పార్టీలోకి తీసుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా... టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై ఆపరేషన్‌ సాఫ్రాన్‌ స్ట్రైక్‌కు శ్రీకారం చుట్టింది.

బడానేతలకు గురిపెడితే... అవతలిపక్షాన్ని దెబ్బకొట్టడంతో పాటు బీజేపీవైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ను అమలు చేస్తూ వలసల వ్యూహానికి పదును పెట్టింది. వరుస ఓటములతో డీలాపడ్డ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరే 20 మందికిపైగా నేతల జాబితాను రూపొందించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ నుంచి కూడా అసంతృప్తుల వలసలు ఉంటాయని, అలా వచ్చే అవకాశమున్న వారితో జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.

కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారనే ధీమాతో ఉంది. వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరికొందరు ముఖ్యనేతలకు అప్పగించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో బీజేపీ ముఖ్యనేత ఒకరు ఇప్పటికే చర్చలు జరిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌ ఇటీవల స్వయంగా భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుటుంబంతో బీజేపీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. 

ముందుగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌
హైదరాబాద్‌ సరిహద్దుల్లోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై బీజేపీ మొదట ఫోకస్‌ పెట్టింది. 1996లో హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలో అప్పటి ఎంఐఎం చీఫ్‌ సలావుద్దీన్‌ ఒవైసీ చేతిలో వెంకయ్యనాయుడు ఓడిపోయినా... గట్టిపోటీనిచ్చారు. అప్పుడు హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న చేవెళ్ల, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించాయి. అందుకే అక్కడి నుంచి తమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు పూనుంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో టచ్‌లో ఉంది.

మహమూబ్‌నగర్‌లోనూ పార్టీ కేడర్‌ బలంగా ఉందని విశ్వసిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డిది ఈ జిల్లాయే. దీనికితోడు జిల్లాలో పార్టీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని డీకే అరుణకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. వీరిద్దరి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించి పని చేసేలా బీజేపీ వ్యూహం రూపొందిస్తోంది. 

వరంగల్‌ కార్పొరేషన్‌లో పట్టు కోసం..
త్వరలో రానున్న గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీజేపీకి మంచి పట్టున్న స్థానాలు ఉన్నాయి. దేశంలో బీజేపీకి రెండే ఎంపీ స్థానాలు ఉన్న 1984లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు పరకాల నియోజకవర్గం నుంచి 1985లోనే వి.జయపాల్‌ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్‌గా డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు బీజేపీ నుంచే పని చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా గ్రామీణ, పట్టణప్రాంతాల్లో బీజేపీకి మంచి కేడర్‌ ఉంది. అందుకే వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై గురి పెట్టింది. అక్కడ పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికను పునాదిగా చేసుకోవాలని భావిస్తోంది. 

ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీలపై భారం
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట్‌ మున్సిపల్‌ ఎన్నికల తరువాత మొత్తంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని భావిస్తోంది. అందుకు ఇప్పుడు కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ పైనే ఉమ్మడి జిల్లాలో పార్టీ విస్తరణ బాధ్యత పెట్టారు. నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వంటి నేతలు ఉన్నారు. ఆదివాలాబాద్‌లో ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. కాబట్టి ఆయా జిల్లాల్లో పార్టీ విస్తరణకు కోసం పెద్ద ఎత్తున చేరికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలే టార్గెట్‌గా ముందుకు వెళుతోంది. మెదక్‌ జిల్లాపైనా కసరత్తు చేస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయం... పార్టీలోకి వలసలను పెంచుతుందనే ధీమాలో ఉంది. ఇక చివరగా ఖమ్మం, నల్గొండ జిల్లాలపై దృష్టి సారించేలా చర్యలు చేపడుతోంది. 

క్యాడర్‌ ఉంది... లీడర్లు కావాలి...
రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. చాలాచోట్ల గ్రామీణ ప్రాంతా ల్లోనూ పార్టీకి కేడర్‌ ఉందని, సైలెంట్‌ ఓటర్లు ఉన్నారని... బలమైన నాయకత్వం అవసరమని భావి స్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే నేతల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో బలంగా ఉన్న పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది.
ఆ తరువాత 2019లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యాక దుబ్బాకలో సంచలన విజయం సాధించిన బీజేపీ... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి రాణించింది. గ్రేటర్‌లో పట్టు నిలిచిందని భావిస్తున్న కమలనాథులు... రాష్ట్రవ్యాప్తంగా విస్తరణపై దృష్టి సారించారు. 

మరిన్ని వార్తలు