వానాకాలం ధాన్యం కొనాల్సిందే..

12 Nov, 2021 01:40 IST|Sakshi
హనుమకొండ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తున్న బీజేపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు 

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ధర్నాలు 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాల సందర్బంగా కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరంగల్, సిరిసిల్ల, సంగారెడ్డి తదితర చోట్ల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను టీఆర్‌ఎస్‌ యూత్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరివైపు మరొకరు తోసుకుంటూ వెళ్లేందుకు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆరోపించారు. కేంద్రం గత ఆగస్టులోనే 60 లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని కొనేందుకు లేఖ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఆ తప్పును కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. పంట పొలాల్లో, కల్లాల వద్ద, రోడ్లపై, మార్కెట్ల వద్ద ధాన్యాన్ని రాశులుగా పోసి రోజుల తరబడి నిరీక్షిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

వరంగల్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కిసాన్‌ మోర్చా ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళనలో జాతీయ కిసాన్‌మోర్చా నేత గోలి మధుసూదన్‌రెడ్డి, నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట సంకినేని వెంకటేశ్వర్‌రావు, రంగారెడ్డి జిల్లాలో బొక్కా నర్సింహారెడ్డి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం తదితర జిల్లాల్లో బీజేపీ మోర్చా నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్‌చార్జులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు