Raja Singh Suspension: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్‌.. పది రోజుల్లోగా..

23 Aug, 2022 16:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. నుపూర్‌ శర్మ​ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్‌. దీంతో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

రాజాసింగ్‌ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్‌ ..  పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వడానికి బీజేపీ పది రోజులు గడువిచ్చింది.  సెప్టెంబర్‌ 2లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.

కాగా మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోపై మజ్లిస్‌ నేతలు, మైనార్టీలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు.దీంతో యూట్యూబ్‌ నుంచి రాజాసింగ్‌ వీడియోను పోలీసులు తొలగించారు.

కొనసాగుతున్న కేసుల పరంపర
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్‌, బహదూర్‌పురా, బాలానగర్‌, డబీర్‌పూర, సంగారెడ్డి నిజామాబాద్‌లో రాజాసింగ్‌పై కేసులు ఫైల్‌ చేశారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్‌

మరిన్ని వార్తలు