అగ్రత్రయ నేతల పర్యటనపైనే తెలంగాణ కాషాయ పార్టీ ఆశలు

6 Jun, 2023 16:24 IST|Sakshi

ఈ నెల 15న ఖమ్మంకు అమిత్ షా..

25న నాగర్ కర్నూల్ కు నడ్డా..

నెలాఖరున నల్లగొండకు ప్రధాని మోదీ

హైదరాబాద్‌లో మోదీ భారీ రోడ్ షోకు ప్లాన్

సాక్షి, హైదరాబాద్:  కాషాయ పార్టీ అగ్ర త్రయ నేతలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. కర్ణాటక ఓటమి.. నేతల చిట్ చాట్లతో కుంగిపోయిన కమలం పార్టీలో పునరుత్తేజం నింపేపనిలో పార్టీ హైకమాండ్ పడింది.  రాబోయే పక్షం రోజుల్లో ముగ్గురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. కాషాయ అగ్రత్రయం పర్యటనలు తెలంగాణ కమలదళానికి కలిసొస్తాయా ? పార్టీ అగ్రనేతలు ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు ? 

నిరాశలో కురుకుపోయిన తెలంగాణ కమలం పార్టీలో నూతనోత్తేజం నింపే ప్రయత్నానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమైంది.  కాషాయపార్టీ అగ్ర నేతలు తెలంగాణలో మోహరించబోతున్నారు.  అటు బీఆర్ఎస్... ఇటు కాంగ్రెస్ ను దాటి ఎన్నికల రేసులో ముందు వరుసలో నిలబడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక ఓటమి పాఠాల నుంచి నేర్చుకున్న అంశాలపై కమలనాథులు దృష్టిపెట్టారు. దక్షిణాదిన అధికారపగ్గాలు చేపట్టేందుకు అవకాశమున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ మాత్రమేనని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కమల వికాసం కోసం పావులు కదుపుతున్నారు.

ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో అక్కడే అమిత్ షాతో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నెల 15న తెలంగాణ గుమ్మం ఖమ్మం ఖిల్లాలో అమిత్ షా సభను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 25న నడ్డా పర్యటించనున్నారు. అమిత్ షా, నడ్డా పర్యటనలు ఫిక్స్ అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై తెలంగాణ కమలనాథులు డ్రాఫ్ట్ రూపొందించారు. మోదీ పర్యటన తేదీలపై పీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ రావల్సి ఉంది. నెలాఖరున మోదీతో నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా మల్కాజిగిరిలో భారీ రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా పక్షం రోజుల్లో ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. నిస్తేజంగా ఉన్న కాషాయశ్రేణుల్లో అగ్రనేతల పర్యటనలు జోష్ నింపుతాయా ? కొత్త నేతల చేరికలు పెరుగుతాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
-ఉదయ్‌ కుమార్‌, సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు