వాట్సాప్‌ యూనివర్సిటీకి వెల్‌కమ్‌.. దమ్‌ బిర్యానీ, ఇరానీ ఛాయ్‌ అంటూ కేటీఆర్‌ వ్యంగ్యం

2 Jul, 2022 07:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నగరం ఘనంగా ముస్తాబైంది. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ ఆంక్షల నడుమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు విమర్శలపర్వంతో.. రాజకీయంగానూ తెలంగాణలో హీట్‌ పెరిగిపోయింది.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. బీజేపీపై వరుసబెట్టి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ సమావేశాలను ఎద్దేవా చేస్తూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘‘అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్‌ యూనివర్సిటీకి(బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ..) స్వాగతం. 

అబద్దాల హామీకోరులందరూ.. మా దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించడం మర్చిపోవద్దు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రాంతాలను సందర్శించి.. మీ మీ రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు కనీసం ప్రయత్నించండి అంటూ ఇక్కడి సందర్శన ప్రాంతాల ఫొటోలను ట్వీట్‌ చేశారు కేటీఆర్‌.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార సాధనే ధ్యేయంగా ఎగ్జిక్యూటివ్‌ సమావేశాలను హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది బీజేపీ. అందుకే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులను నగరానికి రప్పించి ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు.. బహిరంగ సభ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు