మాది సంకీర్ణ ధర్మం- నితీశ్‌దేమో.. : ఎన్డీయే నుంచి నిష్క్రమణపై బీజేపీ స్పందన

9 Aug, 2022 21:02 IST|Sakshi

ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ నిష్క్రమణను బీజేపీ ముందే పసిగట్టిందా? తెలిసి కూడా నితీశ్‌ కుమార్‌ను బుజ్జగించడం, నిలువరించడం లాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు?. అసలు నితీశ్‌ నిష్క్రమణను బీజేపీ ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు??.. తాజా పరిణామాలపై బీజేపీ ఏంమంటోందంటే..
 
బీహార్‌ రాజకీయాల్లో ఇవాళ్టి కీలక పరిణామంపై దేశమంతా చర్చ నడుస్తోంది. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ).. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, సీఎం పదవికి నితీశ్‌ రాజీనామా, ఆ వెంటనే విపక్షాల మద్దతుతో గవర్నర్‌ అనుమతులతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన, బుధవారం సాయంత్రం సీఎంగా ప్రమాణం చేస్తారనే ధృవీకరణ.. ఒకదాని వెంట ఒకటి శరవేగంగా జరిగిపోయాయి. అయితే సోమవారం నాడే ఈ మేరకు బలమైన సంకేతాలు అందినప్పటికీ.. బీజేపీ మౌనంగా ఉండిపోవడం, ఇంత కీలక పరిణామంపై ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడం గమనార్హం. 

ఆ ఉద్దేశంలోనే నితీశ్‌?
నితీశ్‌ కుమార్‌ చేసింది ముమ్మాటికీ మోసమేనని, వెన్నుపోటుతో నితీశ్‌ కుమార్‌ రాజకీయ విశ్వసనీయత సైతం కోల్పోయాడని బీజేపీ బలంగా భావిస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో బీహార్‌ ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని అంటోంది. అందుకే తమ అధిష్టానం సైతం ఆయన్ని నిలువరించే ప్రయత్నాలేవీ చేయలేదని చెబుతోంది. నితీశ్‌ కుమార్‌కి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆరాటంతో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎన్డీయేకి దూరంగా జరిగి ఉండొచ్చు అని బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత చెప్తున్నారు.

టామ్‌ అండ్‌ జెర్రీలా..
బీహార్‌ రాజకీయాల్లో జేడీయూ- బీజేపీల మధ్య విమర్శల పర్వం కొంతకాలంగా నడిచింది.  స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తీరు, బీజేపీ నేతలు నితీశ్‌ సర్కార్‌పై విమర్శలతో ఆయన అసహనంలోకి కూరుకుపోయారు. ఈ లోపే అగ్నిపథ్‌ నిరసనలను ఆయన కట్టడి చేయలేకపోయారని బీజేపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ పరిణామాలతో నితీశ్‌ కుమార్‌ బీజేపీకి, కేంద్రానికి అంటీముట్టనట్లు ఉంటున్నారు. కీలక భేటీలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే బీజేపీ మాత్రం ఆయన్ని శాంతింపజేసేలా ప్రకటనలు చేసింది. జేడీయూ-ఎన్‌డీఏ పొత్తు రాబోయే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, నితీశ్‌ కుమార్‌ సీఎం అభ్యర్థిగా ఉంటారని స్వయంగా అమిత్‌ షా ప్రకటించారు. అయినా నితీశ్‌ కుమార్‌ మాత్రం కూటమి నుంచి వైదొలగాలనే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నితీశ్‌కు, జేడీయూ కీలక నేతలకు అమిత్‌ షా ఫోన్‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. 

బీహార్‌కి కూడా ద్రోహమే
కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సంకీర్ణ ధర్మం బీజేపీ ఏనాడూ తప్పబోదని ప్రకటించారు. తక్కువ సీట్లు ఉన్నా ఆయన్ని(నితీశ్‌ను ఉద్దేశిస్తూ) సీఎంను చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఆయనవి ఉత్త అనుమానాలే అని కుట్ర కోణాల ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇక తాజా పరిణామంపై బీహార్‌ బీజేపీ చీఫ్‌ సంజయ్‌ జైశ్వాల్‌ తీవ్రంగా స్పందించారు. 2020 ఎన్నికలలో NDA హయాంలో JD(U)-BJPలు కలిసి పోరాడం. మేం ఎక్కువ సీట్లు గెల్చుకున్నా.. నితీష్ కుమార్‌ను సీఎం చేశాం. ఈరోజు ఏం జరిగినా అది బీహార్ ప్రజలకు, బీజేపీకి నితీశ్‌ చేసిన ద్రోహమే అని తీవ్రంగా స్పందించారాయన. 


Chirag on Nitish Kumar: ఈరోజు మళ్లీ కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ - నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఐదోసారి, బీహార్ ప్రజల ఆదేశాన్ని అవమానించారు.  బీహార్‌లో తాజా రాజకీయ వాతావరణం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి సొంత ఆశయాలకు ముందు ఏదీ లెక్కలేకుండా పోయింది. బీహార్ కొన్ని సంవత్సరాల వ్యవధిలో మూడు పొత్తుల ద్వారా వెళ్ళింది. నితీశ్‌ కంసుడి లాంటోడు. కంసుడు తన మేనల్లులను తానే చంపించాడు. జార్జ్‌ ఫెర్నాండెజ్‌, ప్రశాంత్‌ కిషోర్‌, ఉపేంద్ర కుష్వాహలను వెన్నుపోటు పొడిచాడు నితీశ్‌. నితీశ్ అహంకారం వ‌ల్ల బీహార్ చాలా న‌ష్ట‌పోయింది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లే ల‌క్ష్యంగా నితీశ్‌కు పెద్ద పెద్ద కోరిక‌లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. నితీశ్‌ విలువల్లేనోడు. నితీశ్‌​ నుంచి ఇలాంటిది ముందే ఊహించాం  ::: లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్

ఇదీ చదవండి: సీఎంగా మరోసారి నితీశ్‌.. ప్రమాణానికి ముహుర్తం ఫిక్స్‌!

>
మరిన్ని వార్తలు