-

మునుగోడుపై కేసీఆర్‌ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే..

1 Nov, 2022 03:14 IST|Sakshi

మునుగోడు/ చండూరు: మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్‌ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. సోమవారం ఆయన మునుగోడు, చండూరులలో విలేకరులతో మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే చండూరులో 100 పడకల ఆస్పత్రిని 15రోజుల్లో ఏర్పాటు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను అద్దంలా మారుస్తానని, చెర్లగూడెం రిజర్వాయర్‌ను త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పడం కపటప్రేమలో భాగమేనని ఆరోపించారు. మునుగోడుపై అంతప్రేమే ఉంటే ఇంతకాలం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలోని 1.72లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తానని చెప్పి నేటికీ ఒక్క ఎకరాకూ ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ కాళ్ల వద్ద నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు.

జీఎస్టీ వాటా ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? 
రూ.40 లక్షల వ్యాపారం దాటిన చేనేతలకు మాత్రమే కేంద్రం 5 శాతం జీఎస్టీ విధించేలా ఒప్పుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేడు దానిని ఎలా వ్యతిరేకిస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్‌కు చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే 2.5 శాతం వాటా ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్న సీఎం ఆ ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్‌ నుంచి గెలిచారని, వారిని టీఆర్‌ఎస్‌ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని డి­మాం­డ్‌ చేశారు.

తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సీబీఐ విచారణ జరగకుండా 51 జీఓ తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరై­డ్‌ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం రూ.800­కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. మహమ్మారి విముక్తికి రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ఎక్కువ నిధులు ఖర్చు చేసినా కేసీఆర్‌ తొమ్మి­దే­ళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు.

అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. 
తెలంగాణలో కేసీఆర్‌ పాలన పోతేనే పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పంటలకు సాగునీరు వస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. నాడు ఎన్టీఆర్‌కు అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, అదే మాదిరిగా అల్లుడు హరీశ్‌రావు వ్యవహరిస్తారనే భయంతోనే కేసీఆర్‌ సచివాలయానికి రాకుండా ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారని ఎద్దేవాచేశారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే కల కేసీఆర్‌కు ఎప్పటికీ నెరవేదన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎంపీ చాడ సురేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఎత్తిపోసే పనిలో మేం.. ఎత్తుకెళ్లే పనిలో బీజేపీ!

మరిన్ని వార్తలు